Donald Trump: వైట్‌హౌస్‌లో రొనాల్డోతో ట్రంప్ ఫుట్‌బాల్.. వైరల్ అవుతున్న ఏఐ వీడియో

Donald Trump and Cristiano Ronaldo Play Football in White House AI Video Goes Viral
  • రొనాల్డోతో ఫుట్‌బాల్ ఆడుతున్న ఏఐ వీడియోను షేర్ చేసిన ట్రంప్
  • వైట్‌హౌస్‌లోనే ఈ మ్యాచ్ జరిగినట్టు వీడియోలో చిత్రీకరణ
  • రొనాల్డో చాలా గొప్ప వ్యక్తి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశంసలు
  • కోట్లలో వ్యూస్‌తో వైరల్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
  • కొన్ని రోజుల క్రితం విందులో రొనాల్డోను కలిసిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో వైట్‌హౌస్‌లో ఫుట్‌బాల్ ఆడితే ఎలా ఉంటుంది? ఈ ఊహకు టెక్నాలజీ జోడించి రూపొందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రొనాల్డోతో కలిసి వైట్‌హౌస్‌లో ఫుట్‌బాల్ ఆడుతున్నట్లు ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వీడియోను ట్రంప్ స్వయంగా గురువారం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో ట్రంప్, రొనాల్డో ఇద్దరూ వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో బంతితో హెడర్లు, డ్రిబ్లింగ్ వంటి విన్యాసాలు చేస్తూ కనిపించారు. ఈ పోస్ట్‌కు ట్రంప్ ఆసక్తికరమైన క్యాప్షన్ జతచేశారు. "రొనాల్డో ఒక గొప్ప వ్యక్తి. వైట్‌హౌస్‌లో అతడిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. చాలా స్మార్ట్, కూల్ వ్యక్తి" అని ట్రంప్ పేర్కొన్నారు.

ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దీనికి దాదాపు 3.4 కోట్ల వ్యూస్, 16 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్‌ వచ్చాయి. ఈ సరదా వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. "ఇది ఏఐ అని విమర్శకులు అంటారు" అని ఒకరు వ్యాఖ్యానించగా, "ఇది ఏదో మీమ్ పేజీ అనుకున్నా, కానీ ఇది అమెరికా అధ్యక్షుడి అధికారిక అకౌంట్" అంటూ మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కొన్ని రోజుల క్రితం సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ గౌరవార్థం వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విందుకు రొనాల్డో తన కాబోయే భార్య జార్జినా రోడ్రిగ్జ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగానే ట్రంప్‌ను కలిశారు. ఈ విందులో ట్రంప్ మాట్లాడుతూ.. తన చిన్న కుమారుడు బారన్, రొనాల్డోకు పెద్ద అభిమాని అని, రొనాల్డోను కలిశాక తనపై బారన్‌కు గౌరవం మరింత పెరిగిందని సరదాగా వ్యాఖ్యానించారు.
Donald Trump
Cristiano Ronaldo
White House
AI video
Artificial Intelligence
Football
Viral video
Georgina Rodriguez
Saudi Prince
Barron Trump

More Telugu News