RBI: ఆర్బీఐ నుంచి కాల్... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!

RBI Warns Against Fraudulent Calls Impersonating Reserve Bank of India
  • ఆర్‌బీఐ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త మోసం
  • ఖాతాలు బ్లాక్ చేస్తామంటూ వస్తున్న వాయిస్ మెయిల్స్
  • ఇది స్కామ్ అంటూ హెచ్చరించిన పీఐబీ ఫ్యాక్ట్‌చెక్
  • అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన
సైబర్ నేరగాళ్లు రోజుకో నూతన పద్ధతిలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏకంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పేరును వాడుకుంటూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్‌బీఐ నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి, వారి బ్యాంకు ఖాతాలు బ్లాక్ అవుతాయని భయపెట్టి డబ్బులు కొల్లగొట్టేందుకు కొత్త పథకం పన్నారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం హెచ్చరించింది.

మోసం చేసే విధానం ఇదే..

"నమస్తే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. మీ క్రెడిట్ కార్డ్‌పై మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు గుర్తించాం. అందువల్ల రాబోయే రెండు గంటల్లో మీ అన్ని బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేయబోతున్నాం. మరిన్ని వివరాల కోసం 9 ప్రెస్ చేయండి" అంటూ ఒక వాయిస్ మెయిల్ మొబైల్ ఫోన్లకు వస్తోంది.

ఈ సందేశం విని భయంతో 9 నొక్కితే నేరుగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లేనని పీఐబీ స్పష్టం చేసింది. ప్రజల భయాన్నే అవకాశంగా మార్చుకుని మోసగాళ్లు డబ్బులు కాజేస్తారని హెచ్చరించింది. ఆర్‌బీఐ కానీ, మరే ఇతర బ్యాంకు కానీ ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు అడగవని, ఖాతాలు బ్లాక్ చేస్తామని బెదిరించవని గుర్తుంచుకోవాలని సూచించింది.

ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి అనుమానాస్పద సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ వాట్సాప్ నంబర్ +918799711259 లేదా [email protected] ఈ-మెయిల్ ఐడీ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పీఐబీ తెలిపింది. 
RBI
Reserve Bank of India
PIB Fact Check
Cyber Crime
Bank Fraud
Online Scam
Financial Security
Credit Card Fraud
Voice Mail Scam

More Telugu News