Chandrababu Naidu: అన్నదాత అభివృద్ధికి పంచసూత్రాలు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Unveils Five Sutras for Farmer Development
  • కడప జిల్లాలో ‘అన్నదాత సుఖీభవ’
  • రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
  • 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్లు జమ
  • వ్యవసాయ రంగ అభివృద్ధికి పంచసూత్ర ప్రణాళిక వెల్లడి
  • ప్రకృతి సేద్యం, టెక్నాలజీ వినియోగంపై రైతులకు పిలుపు
  • రాయలసీమను పారిశ్రామిక, హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ
రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు తమ ప్రభుత్వం పటిష్టమైన పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఐటీ నిపుణులకు ఎంతటి కీర్తిప్రతిష్ఠలు ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా అదే స్థాయిలో గుర్తింపు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 

బుధవారం కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బటన్ నొక్కి 46,85,838 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.7 వేల చొప్పున మొత్తం రూ.3,135 కోట్లను జమ చేశారు. అనంతరం ‘రచ్చబండ’ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజావేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. “రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా, ఇచ్చిన మాటకు కట్టుబడి నిధులు విడుదల చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ ఏడాది ఆగస్టులో తొలి విడతగా రూ.3,175 కోట్లు జమ చేశాం. ఇప్పుడు రెండో విడతతో కలిపి మొత్తం రూ.6,310 కోట్లను అన్నదాతలకు అందించాం. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా విధ్వంసానికి గురైంది. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. రైతు సంక్షేమంపై మా చిత్తశుద్ధికి ఈ నిధుల విడుదలే నిదర్శనం” అని చంద్రబాబు అన్నారు.

పంచ సూత్రాలతో వ్యవసాయ ప్రగతి

వ్యవసాయ రంగం అభివృద్ధికి తన ప్రభుత్వం ఐదు కీలక సూత్రాలతో పనిచేస్తోందని చంద్రబాబు వివరించారు. “నీటి భద్రత, ప్రకృతి సేద్యం, టెక్నాలజీ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సహాయం అనే పంచ సూత్రాలతో రైతే రాజుగా ఉండే రాష్ట్రాన్ని నిర్మిస్తాం,” అని తెలిపారు.

1. నీటి భద్రత: “నీరు సమృద్ధిగా ఉన్నచోటే అభివృద్ధి సాధ్యం. రాయలసీమ కష్టాలు నాకు తెలుసు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్నదే నా సంకల్పం. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు, హంద్రీనీవా ద్వారా రాయలసీమకు నీరందించాం. సముద్రంలోకి వృథాగా పోయే గోదావరి జలాలను సీమకు తరలించి జలాశయాలు నింపాం. భూగర్భ జలాలు పెంచడం వల్ల ఒకప్పుడు 100 అడుగుల లోతులో ఉన్న నీరు, ఇప్పుడు 7.3 మీటర్లకే అందుబాటులోకి వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉండటం వల్లే ఇది సాధ్యమైంది” అని సీఎం వివరించారు.

2. ప్రకృతి సేద్యం: “ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. రైతులు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించి ప్రకృతి సేద్యం వైపు మళ్లాలి. రాష్ట్రంలో ఇప్పటికే 12 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం జరుగుతుండగా, మరో 6 లక్షల ఎకరాలను దీని పరిధిలోకి తెస్తున్నాం. దేశంలోనే 18 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసే ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలవబోతోంది. పంజాబ్‌లో అధిక ఎరువుల వాడకంతో ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆ పరిస్థితి మనకు రాకూడదు” అని హితవు పలికారు.

3. టెక్నాలజీ వినియోగం (అగ్రిటెక్): “సాగులో డ్రోన్లు, శాటిలైట్ల వినియోగాన్ని పెంచుతాం. రాయలసీమలో డ్రోన్, స్పేస్ సిటీలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా భూసార పరీక్షలు, వాతావరణ మార్పులు, పంటల డిమాండ్ వంటి వివరాలను రైతులకు అందిస్తాం. టెక్నాలజీతో పెట్టుబడి వ్యయం తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్‌కు ఎస్సీ, ఎస్టీలకు 100%, రాయలసీమ-ప్రకాశం జిల్లాల్లో 90%, కోస్తాలో 70% సబ్సిడీని పునరుద్ధరించాం” అని తెలిపారు.

4. ఫుడ్ ప్రాసెసింగ్: “రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తున్నాం. సీఐఐ సదస్సులో రూ.13 వేల కోట్ల పెట్టుబడులతో 38 పరిశ్రమలకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా, కోస్తాను ఆక్వా హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. అరకు కాఫీ నుంచి కోనసీమ కొబ్బరి వరకు అన్ని ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తాం” అని చంద్రబాబు పేర్కొన్నారు.

5. ప్రభుత్వ సహాయం: “విపత్తులు సంభవించినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతులను ఆదుకుంటాం. కూటమి ప్రభుత్వం వచ్చాక విపత్తుల నష్టపరిహారంగా రూ.310 కోట్లు చెల్లించాం. మొంథా తుఫాను నష్టపరిహారాన్ని కూడా త్వరలోనే అందిస్తాం. రూ.15,955 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తున్నాం” అని తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లు

“గత ఐదేళ్ల విధ్వంస పాలనకు చరమగీతం పాడి ప్రజలకు స్వేచ్ఛనిచ్చాం. తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలతో పాటు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాం. రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్ర పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Agriculture
Farmers welfare
Pancha Sutras
Water security
Natural farming
Food processing
AP government
PM Kisan

More Telugu News