Butter Chicken: బటర్ చికెన్ ఎలా పుట్టిందో తెలుసా...?

Butter Chicken Ranked Among Worlds Best Chicken Dishes
  • ప్రపంచ అత్యుత్తమ చికెన్ వంటకాల్లో బటర్ చికెన్‌కు 5వ స్థానం
  • ప్రముఖ ఫుడ్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' విడుదల చేసిన జాబితా
  • దిల్లీలోని మోతీ మహల్ రెస్టారెంట్‌లో ఈ వంటకం పుట్టింది
  • జాబితాలో తందూరి చికెన్, చికెన్ టిక్కాకు కూడా చోటు
భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా మరోసారి అరుదైన గౌరవం లభించింది. మన దేశానికి చెందిన ప్రఖ్యాత 'బటర్ చికెన్' (ముర్ఘ్ మఖనీ) ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ చికెన్ వంటకాల్లో ఒకటిగా నిలిచింది. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' విడుదల చేసిన జాబితాలో ఈ వంటకానికి 5వ ర్యాంక్ దక్కింది. బటర్ చికెన్‌కు టేస్ట్ అట్లాస్ 4.5 రేటింగ్ ఇచ్చింది. 

అసలు ఈ వంటకం పుట్టుక చాలా ఆసక్తికరం. 1950లలో దిల్లీలోని మోతీ మహల్ రెస్టారెంట్‌లో కుందన్ లాల్ గుజ్రాల్ చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. ఆనాడు... మిగిలిపోయిన తందూరి చికెన్‌ను టమాటాలు, వెన్న, సుగంధ ద్రవ్యాలతో కలిపి గ్రేవీ తరహాలో తయారు చేశారు. కాలక్రమంలో అది బటర్ చికెన్ గా ఎంతో ప్రత్యేకతను సంపాదించుకుంది. సాధారణంగా నాన్‌తో తినే ఈ వంటకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

ఈ జాబితాలో టర్కీకి చెందిన 'పిలిచ్ టోప్‌కాపీ' మొదటి స్థానంలో నిలవగా, మొరాకో వంటకం 'ఆర్ఫిస్సా' రెండో స్థానాన్ని దక్కించుకుంది. దక్షిణ కొరియాకు చెందిన 'కొరియన్ ఫ్రైడ్ చికెన్' మూడో స్థానంలో, పెరూ వంటకం 'పోలో అ లా బ్రాసా' నాలుగో స్థానంలో ఉన్నాయి.

ఈ జాబితాలో బటర్ చికెన్‌తో పాటు మరికొన్ని భారతీయ వంటకాలకు కూడా స్థానం లభించింది. తందూరి చికెన్ 14వ స్థానంలో, చికెన్ టిక్కా 35వ స్థానంలో, చికెన్-65 38వ స్థానంలో నిలిచాయి. ఒక సాధారణ రెస్టారెంట్‌లో వృథాను అరికట్టడానికి చేసిన ప్రయోగం, నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకునే స్థాయికి చేరడం విశేషం. "ఈ సాధారణ వంటకం రాజులకు తగినదిగా మారింది" అని టేస్ట్ అట్లాస్ తన కథనంలో పేర్కొంది.
Butter Chicken
Murgh Makhani
Indian Cuisine
Taste Atlas
Kundan Lal Gujral
Moti Mahal Restaurant
Delhi
Pilich Topkapi
Tandoori Chicken

More Telugu News