Nara Lokesh: బాబా నన్ను బంగారూ అని పిలిచినట్లుంటుంది: నారా లోకేశ్

Nara Lokesh Feels Baba Still Calls Him Bangaru
  • సత్యసాయి జయంతి ఉత్సవాల్లో మంత్రి లోకేశ్ ప్రసంగం
  • మనుషుల్లో ప్రేమ ఉన్నంతవరకు బాబా మనమధ్యే ఉంటారని వ్యాఖ్య
  • ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయమన్న మంత్రి
ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయమని ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. పుట్టపర్తికి వచ్చిన ప్రతిసారీ బాబా తనను బంగారూ అని పిలిచినట్లు అనిపిస్తుందని చెప్పారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మన మధ్యలోనే ఉంటారని అన్నారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.

బాబా శతజయంతి కేవలం ఓ వేడుక కాదని, ఇది లోతైన, దైవిక కృతజ్ఞతా క్షణమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ప్రేమ, సేవ, శాశ్వతమైన విలువల ద్వారా మానవాళిని మార్చిన వందేళ్ల పవిత్ర ప్రయాణమని అన్నారు. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయిబాబా చారిత్రాత్మక శతాబ్ది ఉత్సవాల నిర్వాహకులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని చెప్పారు.

‘‘భగవాన్ చెప్పినట్లు.. సేవే కులం, సమానత్వమే మతం. ప్రార్థించే పెదవుల కన్నా సాయంచేసే చేతులు పవిత్రమైనవి. సత్యసాయి చూపించిన మార్గం అందరినీ ప్రేమించు – అందరికి సేవ చేయి. ఎప్పటికీ సహాయం చేయి – ఎవరినీ బాధించకు. ఆయన చూపిన బాటలో మనమంతా నడవాలి. ‘నా జీవితం నా సందేశం’ అని ఆయన జీవితాన్ని మనకు పాఠంగా నేర్పారు” అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
Sathya Sai Baba
Prasanthi Nilayam
Chandrababu Naidu
Pawan Kalyan
Narendra Modi
Sachin Tendulkar
Aishwarya Rai Bachchan
AP Minister
Sathya Sai Centenary Celebrations

More Telugu News