Pakistan government: పాకిస్థాన్ ప్రభుత్వంపై ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం సంచలన ఆరోపణలు

Khyber Pakhtunkhwa CM Sohail Afridi blames Pakistan for attacks
  • తమ ప్రావిన్స్ లో ప్రభుత్వమే ఉగ్ర దాడులు చేయిస్తోందని ఆరోపించిన ముఖ్యమంత్రి
  • ఆఫ్ఘనిస్థాన్ – ఖైబర్ ప్రావిన్స్ మధ్య సంబంధాలను చెడగొట్టడమే ప్రభుత్వ లక్ష్యం
  • శాంతి ప్రయత్నాలను అడ్డుకునేందుకే దాడులు చేయిస్తోందని మండిపాటు
 పాకిస్థాన్ ప్రభుత్వంపై ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి సోహైల్‌ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రావిన్స్ లో పాకిస్థాన్ ప్రభుత్వమే ఉగ్ర దాడులు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్థాన్ తో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ కు సత్సంబంధాలు నెలకొనడంపై ఇస్లామాబాద్ ఆగ్రహంగా ఉందని, దీనిని చెడగొట్టడానికే ఖైబర్ ప్రావిన్స్ లో ఉగ్ర వాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన మండిపడ్డారు. శాంతి ప్రయత్నాలను, చర్చలను అడ్డుకోవడమే దీని వెనకున్న అసలు ఉద్దేశమని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం సోహైల్ అఫ్రిదిని ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

శాంతి ప్రయత్నాలను అడ్డుకోవడానికే..
సోహైల్ అఫ్రిది కిందటి నెలలోనే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన నేత. ఇటీవలి కాలంలో ఖైబర్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంటున్న ఉగ్ర దాడులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. పాక్ ప్రభుత్వమే ఈ దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇటీవల పష్తూన్‌ తహాఫుజ్‌ మూమెంట్‌ (పీటీఎం) సభ్యులు కిడ్నాప్ కు గురైనట్లు తెలుస్తోంది. దీనిని అఫ్రిది తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచ దేశాలు సహించకూడదని ఆయన పేర్కొన్నారు. శాంతి ప్రయత్నాలకు భంగం కలిగించేవారిని ఉమ్మడి శత్రువుగా పరిగణిస్తామని సోహైల్ అఫ్రిది హెచ్చరించారు.

ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో..
పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో సైనిక బలగాలు సామాన్యులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని సీఎం అఫ్రిది ఆరోపించారు. ఉగ్రవాదుల ఏరివేత పేరుతో సైనికులు సామాన్యులపై దౌర్జన్యం చేస్తున్నారని, సొంత ప్రజలనే చంపేస్తున్నారని విమర్శించారు. కాగా, పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లోని తిరా లోయలో ఇటీవల పాక్‌ వైమానిక దాడులు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారని వార్తలు వెలువడ్డాయి. సొంత ప్రజలపైనే పాక్ సైన్యం దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనను ఖైబర్ పఖ్తుంఖ్వా సీఎం సోహైల్ అఫ్రిది గుర్తు చేశారు.
Pakistan government
Terrorist attacks
Khyber Pakhtunkhwa
Sohail Afridi
Afghanistan
PTI party
Pashtun Tahaffuz Movement
Military operations
Tribal areas
Peace talks

More Telugu News