TTD: 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం.. తేదీలు, టికెట్ల వివరాలు ఇవే!

TTD Announces 10 Days of Vaikunta Dwara Darshan Details
  • తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు
  • సీఎం చంద్రబాబు ఆదేశాలతో సామాన్య భక్తులకు ప్రాధాన్యం
  • మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించింది. డిసెంబర్ 30వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని ప్రకటించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈసారి సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.

పది రోజుల దర్శన కాలంలో మొత్తం 182 గంటల సమయం ఉండగా, అందులో 164 గంటలను సాధారణ భక్తులకే కేటాయించారు. వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యే మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1) రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. ఈ మూడు రోజులకు గాను ఈ-డిప్ లాటరీ పద్ధతిలో టికెట్లను కేటాయించనున్నారు. 

ఇందుకోసం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. డిసెంబర్ 2న లాటరీ ద్వారా ఎంపికైన భక్తులకు టికెట్లు కేటాయిస్తారు. టీటీడీ వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా పారదర్శకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఇక జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకు 15,000 చొప్పున రూ.300 దర్శన టికెట్లను, 1,000 శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. మరోవైపు, తిరుమల, తిరుపతి స్థానిక భక్తుల కోసం జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 చొప్పున ప్రత్యేక టోకెన్లు జారీ చేయనున్నారు. 

ఈ పది రోజుల్లో ఏడు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు. కేవలం అత్యవసర ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని టీటీడీ వెల్లడించింది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 
TTD
Tirumala
Vaikunta Ekadasi
Vaikunta Dwara Darshan
Chandrababu Naidu
Tirupati
TTD tickets
e-Dip lottery
Srivani Trust
Vip break darshan

More Telugu News