Giddalur Tehsildar Office: ఓఎల్ఎక్స్ లో గిద్దలూరు తహసీల్దారు ఆఫీసు.. రూ. 20 వేలకు అమ్మకం!

Giddalur Tehsildar Office Listed for Sale on OLX
  • ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం
  • కేవలం రూ.20 వేలకే అంటూ గుర్తుతెలియని వ్యక్తి పోస్ట్
  • వైరల్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్
  • హైదరాబాద్‌లో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పాత వస్తువులను అమ్ముకోవడానికి, కొనడానికి ఉపయోగపడే ఓఎల్ఎక్స్‌లో ఏకంగా ఓ ప్రభుత్వ కార్యాలయాన్నే అమ్మకానికి పెట్టాడో ప్రబుద్ధుడు. ఈ వింత ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటుచేసుకుంది. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం ఫొటోను ఓఎల్ఎక్స్‌లో పోస్ట్ చేసి, కేవలం రూ.20 వేలకే అమ్ముతానని ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రకటించడం సంచలనం రేపింది.

వివరాల్లోకి వెళితే... గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం అమ్మకానికి ఉందంటూ ఓఎల్ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే గిద్దలూరు తహసీల్దార్ ఎం. ఆంజనేయరెడ్డి నిన్న అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడి ఆచూకీని గుర్తించారు. అనుమానితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని, తెలంగాణ పోలీసుల సహకారంతో నిన్న రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాన్నే అమ్మకానికి పెట్టి ఆకతాయి చేష్టలకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Giddalur Tehsildar Office
Giddalur
Prakasam District
OLX
Government Office Sale
Cyber Crime
Hyderabad Police
Tehsildar Anjaneya Reddy
Andhra Pradesh
Telangana Police

More Telugu News