రూటు మార్చిన అన్నపూర్ణ స్టూడియోస్
- తొలిసారిగా పరభాషా చిత్రాల పంపిణీలోకి అన్నపూర్ణ స్టూడియోస్
- మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'EKO' హక్కుల కైవసం
- ఏపీ, తెలంగాణలో ఈ నెల 21న సినిమా విడుదల
ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్రాల నిర్మాణంలో, పంపిణీలో అన్నపూర్ణ స్టూడియోస్ కీలక పాత్ర పోషిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సొంత డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాలు కలిగిన ఈ సంస్థ, ఇప్పటివరకు కేవలం తెలుగు సినిమాలకే పరిమితమైంది. అయితే, తొలిసారిగా మలయాళంలో దింజిత్ అయ్యతన్ దర్శకత్వంలో రూపొందిన 'EKO' చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. "మలయాళ చిత్రాలు ఎప్పుడూ విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇటీవల కాలంలో తెలుగులోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. 'EKO' టీజర్, ట్రైలర్ చూశాక ఈ సినిమాను తెలుగు వారికి అందించాలనిపించింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. మొదటిసారిగా ఒక మలయాళ చిత్రాన్ని పంపిణీ చేయడం మాకు ఎంతో ముఖ్యమైన విషయం. భవిష్యత్తులో మా సంస్థ నుంచి మరిన్ని కొత్త తరహా చిత్రాలు వస్తాయి" అని తెలిపారు.