Arvalli district fire accident: అంబులెన్స్‌కు మంటలు.. వైద్యుడు, నవజాత శిశువు సహా నలుగురి సజీవ దహనం

Gujarat Doctor newborn 4 die in ambulance fire in Arvalli district
  • గుజరాత్‌లో అంబులెన్స్‌లో చెలరేగిన మంటలు
  • మెరుగైన వైద్యం కోసం అహ్మదాబాద్‌కు తరలిస్తుండగా ఘటన
  • ముగ్గురికి గాయాలు, సమీప ఆసుపత్రికి తరలింపు
  • ప్రమాద కారణాలపై ఫోరెన్సిక్ నిపుణులతో దర్యాప్తు
గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్వల్లీ జిల్లా మొదాస పట్టణం సమీపంలో ఓ అంబులెన్స్‌లో మంటలు చెలరేగి నవజాత శిశువు, డాక్టర్‌ సహా నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మరో ముగ్గురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టిన తర్వాత అనారోగ్యానికి గురైన ఒక రోజు పసికందును మెరుగైన చికిత్స కోసం మొదాసలోని ఆసుపత్రి నుంచి అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మొదాస-ధన్సురా రహదారిపై అంబులెన్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో పసికందుతో పాటు ఆ చిన్నారి తండ్రి జిగ్నేష్ మోచీ (38), డాక్టర్ శాంతిలాల్ రెంటియా (30), నర్సు భూరిబెన్ మానత్ (23) అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్ వెనుక భాగంలో మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ వాహనాన్ని నెమ్మది చేశాడు. ముందు సీట్లలో కూర్చున్న డ్రైవర్ అంకిత్ ఠాకూర్, జిగ్నేష్ బంధువులు గౌరంగ్ మోచీ, గీతాబెన్ మోచీ గాయాలతో బయటపడ్డారు. వెనుక భాగంలో ఉన్న నలుగురూ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే జరగరాని నష్టం జరిగిపోయింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించినట్లు జిల్లా ఎస్పీ మనోహర్‌సిన్హ్ జడేజా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Arvalli district fire accident
Gujarat ambulance fire
newborn baby death
Dr Shantilal Rentia
Modasa fire accident
road accident India
ambulance accident
fire accident Gujarat
nurse Bhuriben Manat
Jignesh Mochi

More Telugu News