ఉద్యోగాలకే మా ప్రాధాన్యం.. రేడియేషన్ భయాలు లేవు: నారా లోకేశ్
- గూగుల్ ప్రాజెక్ట్‌పై లోకేశ్ కీలక వ్యాఖ్యలు
- ఏపీని ప్రపంచ స్థాయి ఏఐ హబ్‌గా మారుస్తామని వ్యాఖ్య
- గూగుల్ డేటా సెంటర్ విలువ ప్రజలకు తెలుసన్న మంత్రి
తర్లువాడలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్‌పై ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. రేడియేషన్ వంటి ఆందోళనలు ఉన్నప్పటికీ, స్థానిక ప్రజలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ కథనం పేర్కొంది. ఈ విషయాన్ని ఉటంకిస్తూ, గూగుల్ డేటా ప్రాజెక్టు విలువ ప్రజలకు తెలుసని లోకేశ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌లను నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ హబ్‌ల ద్వారా నూతన ఆవిష్కరణలు ఊపందుకుంటాయని, సాంకేతికంగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యం కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాదని, తద్వారా యువతకు ఉపాధి కల్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమని ఆయన పేర్కొన్నారు.