Sujan Mukherjee: టీమిండియా సూచన మేరకే పిచ్ తయారుచేశా: ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యురేటర్‌ సుజన్‌ ముఖర్జీ

Sujan Mukherjee Prepared Pitch as per Team India Instructions
  • మూడు రోజుల్లోనే ముగిసిన భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్ట్
  • ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై వెల్లువెత్తిన విమర్శలు
  • క్యూరేటర్‌కు మద్దతుగా నిలిచిన కోచ్ గంభీర్, గంగూలీ
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగియడంతో పిచ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఆ పిచ్‌ను టీమిండియా యాజమాన్యం సూచనల మేరకే రూపొందించినట్లు తేలింది. భారత కోచ్ గౌతమ్ గంభీర్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించడంతో వివాదానికి తెరపడింది.

ఈ మ్యాచ్‌లో ఏ జట్టు కూడా 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. బౌలర్ల ఆధిపత్యం నడుమ దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీపై విమర్శలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ, "భారత శిబిరం నుంచి ఎలాంటి పిచ్ కావాలో స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. వారు చెప్పిన ప్రకారమే నేను పిచ్‌ను సిద్ధం చేశాను. నా పనిని పూర్తి అంకితభావంతో చేశాను. ఇతరుల వ్యాఖ్యలను నేను పట్టించుకోను" అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

సుజన్‌కు మద్దతుగా సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ, "టీమిండియా కోరుకున్న పిచ్‌నే తయారు చేశాం. మ్యాచ్‌కు నాలుగు రోజుల ముందు నుంచి పిచ్‌కు నీళ్లు పెట్టడం ఆపేశాం. అందుకే అది అలా స్పందించింది. ఇందులో క్యూరేటర్ తప్పు లేదు" అని స్పష్టం చేశారు.

టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే విషయాన్ని అంగీకరించారు. "మా సూచనల మేరకే పిచ్‌ను సిద్ధం చేశారు. ఇది బ్యాటర్లకు మరీ అంత కఠినమైన పిచ్ ఏమీ కాదు. ఇలాంటి పిచ్‌పై ఓపికగా డిఫెన్స్ ఆడితే పరుగులు వస్తాయి" అని పేర్కొన్నారు.

124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 93 పరుగులకే ఆలౌట్ అయింది. సిరీస్‌లో నిలవాలంటే గువాహటి వేదికగా నవంబర్ 22న ప్రారంభం కానున్న రెండో టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంది.
Sujan Mukherjee
Eden Gardens
pitch curator
India vs South Africa
Gautam Gambhir
Sourav Ganguly
Kolkata Test
pitch controversy
Bengal cricket
cricket pitch

More Telugu News