Nazeeruddin: సౌదీ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది హైదరాబాదీలు మృతి .. శోకసంద్రమైన విద్యానగర్

Nazeeruddin Family of 18 Hyderabadis Die in Saudi Accident
  • ఉమ్రా యాత్రకు వెళ్లగా జరిగిన ఘోర విషాదం
  • మూడు తరాలకు చెందిన వారు ప్రాణాలు కోల్పోయిన వైనం
  • బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాజకీయ ప్రముఖులు
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌లోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఉమ్రా యాత్రకు వెళ్లిన విద్యానగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఒకేసారి మూడు తరాల వారిని తుడిచిపెట్టింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 9న ఉమ్రా యాత్రకు బయలుదేరారు. ఆయన భార్య, కుమారుడు సల్లావుద్దీన్, ముగ్గురు కుమార్తెలు, వారి పిల్లలతో సహా మొత్తం 18 మంది ఈ యాత్రలో పాల్గొన్నారు. మక్కాలో యాత్రను పూర్తి చేసుకుని మదీనాకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కుటుంబ సభ్యులంతా దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో రెండేళ్ల నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. అమెరికాలో ఉంటున్న నజీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్ యాత్రకు వెళ్లకపోవడంతో ఆయన ఒక్కరే మిగిలారు.

ప్రమాదానికి ముందు రోజు రాత్రి నజీరుద్దీన్ హైదరాబాద్‌లోని బంధువులతో ఫోన్‌లో మాట్లాడారు. యాత్ర పూర్తవుతోందని, మదీనా వెళ్లాల్సి ఉందని చెప్పడమే ఆయన చివరి మాటలయ్యాయి. కుటుంబమంతా ఒకేసారి ప్రయాణం చేయవద్దని తాను ముందే హెచ్చరించానని నజీరుద్దీన్ సోదరుడు సయ్యద్ రషీద్ కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు విద్యానగర్‌లోని నజీరుద్దీన్ ఇంటికి చేరుకుని వారి బంధువులను పరామర్శించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, రెహ్మత్‌ బేగ్ తదితరులు బాధితులను ఓదార్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించి, ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనతో విద్యానగర్ ప్రాంతం శోకసంద్రంలో మునిగిపోయింది. 
Nazeeruddin
Saudi Arabia accident
Hyderabad family
Umrah pilgrimage
Road accident
Vidyangar Hyderabad
Indian pilgrims
Saudi road crash
Family tragedy
Makkah Madina

More Telugu News