Chandrababu Naidu: అన్నదాత సుఖీభవ: ఈ నెల 19న రైతుల ఖాతాల్లోకి రెండో విడత నిధులు

Rythu Sukhibhava Second Phase Funds to be Released on 19th by Chandrababu
  • అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదలకు రంగం సిద్ధం
  • 46 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్లు జమ
  • ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.7 వేలు
  • నవంబరు 19న కమలాపురంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శ్రీకారం
  • వ్యవసాయరంగంపై ప్రభుత్వ ఆలోచనల వివరణకు సన్నాహాలు
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

రెండో విడతలో భాగంగా మొత్తం 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3135 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందించనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5 వేలు కలిపి ప్రతి రైతు ఖాతాలో మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. ఇప్పటికే ఆగస్టు నెలలో తొలి విడత కింద రూ.3174 కోట్లు అందించగా, రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.6309.44 కోట్లను రైతులకు అందజేసినట్లు అవుతుంది.

ఈ నెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబు కమలాపురంలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొని ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. పుట్టపర్తి పర్యటన ముగించుకున్న అనంతరం ఆయన మధ్యాహ్నం కమలాపురం చేరుకుంటారు. ఈ కార్యక్రమాన్ని కేవలం నిధుల విడుదలకే పరిమితం చేయకుండా, వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ఆలోచనలను, భవిష్యత్ ప్రణాళికలను రైతులకు వివరించేలా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 వేలకు పైగా రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు స్థానికంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అగ్రిటెక్, డిమాండ్ ఉన్న పంటల సాగు, మార్కెటింగ్ సౌకర్యాలు, ప్రకృతి సేద్యం, భూసార పరీక్షల ప్రాముఖ్యత, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా పంటకు అదనపు ధర కల్పించడం వంటి కీలక అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
Chandrababu Naidu
Rythu Sukhibhava
PM Kisan
Andhra Pradesh
farmers welfare
agriculture scheme
Kamalapuram
farmer assistance
direct benefit transfer
AP government

More Telugu News