Azam Khan: నకిలీ పాన్ కార్డు కేసు.. సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్, కుమారుడికి ఏడేళ్ల జైలు శిక్ష

Azam Khan and son sentenced to 7 years in fake PAN card case
  • ఇద్దరిని దోషులుగా తేల్చిన ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు
  • జైలు శిక్షతో పాటు రూ. 50 వేల చొప్పున జరిమానా
  • అది కోర్టు నిర్ణయమని వ్యాఖ్యానించిన ఆజం ఖాన్, కుమారుడు
2019లో వేర్వేరు పుట్టిన తేదీలను ఉపయోగించి రెండు పాన్ కార్డులు పొందిన కేసులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజం ఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజంలను రాంపూర్ ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 50 వేల చొప్పున జరిమానా విధించింది. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

తీర్పు అనంతరం వారిని రాంపూర్ కోర్టు నుంచి జిల్లా జైలుకు భారీ భద్రత మధ్య తరలించారు. ఈ సందర్భంగా మీడియా వారిని పలకరించగా, "ఇప్పుడేం చెబుతాం, అది కోర్టు నిర్ణయం" అని అన్నారు. "వారు నన్ను దోషిగా భావించి శిక్ష విధించారు" అని కోర్టు తీర్పును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ప్రాసిక్యూషన్ ప్రకారం ఆజం ఖాన్ గతంలో కొన్ని రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆ కాలాన్ని ఏడేళ్ల శిక్షలో న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ఈ శిక్షపై అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

2019లో రాంపూర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకుడు ఆకాశ్ సక్సేనా ఫిర్యాదు చేయగా, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అబ్దుల్లా 1993 జనవరి 1న జన్మించినట్లుగా పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖకు సమర్పించారు. ఇది అతని పాఠశాల సర్టిఫికెట్‌తో సరిపోలింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలోను ఇదే పాన్ కార్డును సమర్పించారు. అయితే ఆ తర్వాత తన తండ్రితో కలిసి నకిలీ పాన్ కార్డును పొందినట్లు విచారణలో తేలింది.
Azam Khan
Fake PAN card case
Abdullah Azam
Rampur court
BSP leader
Jail sentence

More Telugu News