Ravi Agarwal: ముందుగానే అందుబాటులోకి ఐటీఆర్ ఫారాలు: సీబీడీటీ చీఫ్ రవి అగర్వాల్

Ravi Agarwal ITR Forms to be Available Early
  • ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో కొత్త చట్టం
  • కొత్త ఆదాయ చట్టానికి సంబంధించి కొత్త ఫారాలు, నిబంధనల రూపకల్పన 
  • ముందుగానే అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అర్థం చేసుకోవడానికి సమయం ఉంటుందన్న అగర్వాల్
వచ్చేసారి ఐటీ రిటర్న్స్ ఫారాలు ముందుగానే అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చీఫ్ రవి అగర్వాల్ వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం-2025 కింద ఐటీఆర్ ఫారాలను ముందుగానే అందుబాటులోకి తేనున్నట్లు ఆయన తెలిపారు. ఆరు దశాబ్దాలుగా చెల్లుబాటులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో తీసుకువచ్చిన కొత్త చట్టానికి అనుగుణంగా ఈ ఫారాలు ఉంటాయని పేర్కొన్నారు.

ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో ట్యాక్స్ పేయర్స్ లాంజ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త ఆదాయ చట్టానికి సంబంధించిన కొత్త ఫారాలు, నిబంధనల రూపకల్పన జరుగుతోందని, జనవరి నాటికే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఫారాలను ముందుగానే అందుబాటులోకి తీసుకురావడం వల్ల ప్రస్తుత విధానాన్ని అర్థం చేసుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు సమయం దొరుకుతుందని అన్నారు.

కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025కు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. టీడీఎస్ త్రైమాసిక రిటర్ను ఫారాలు, ఐటీఆర్ ఫారాలు వంటివి ఇందులో ఉంటాయి. ప్రస్తుత ఫారాలను వెనక్కి తీసుకుని సరళమైన ఫారాలు రూపొందించే అంశంపై సీబీడీటీ పనిచేస్తోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది.
Ravi Agarwal
CBDT
ITR Forms
Income Tax Act 2025
Tax Payers
Income Tax Returns
TDS

More Telugu News