Upendra Dwivedi: అలా చేస్తే పాకిస్థాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది: భారత్ హెచ్చరిక

Upendra Dwivedi warns Pakistan of severe consequences
  • ఉగ్రవాద గ్రూపులకు మద్దతును కొనసాగించవద్దని హెచ్చరిక
  • ఉగ్రవాదులను, వారికి మద్దతిచ్చేవారిని భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని స్పష్టీకరణ
  • అడ్డంకులు సృష్టిస్తే దీటుగా స్పందిస్తామని వెల్లడి
భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాద గ్రూపులకు మద్దతును కొనసాగిస్తే పాకిస్థాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. ఉగ్రవాదులను, వారికి మద్దతిచ్చే వారిని భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

పాకిస్థాన్‌తో వ్యవహరించే విషయంలో భారత ప్రభుత్వం కొత్త విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఉగ్ర ముఠాలను ఎగదోయడం మానకపోతే పాకిస్థాన్ అస్థిత్వమే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ ప్రజల పురోగతి, శ్రేయస్సుపై దృష్టి పెడుతుందని అన్నారు. తన మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, దీటుగా స్పందిస్తుందని స్పష్టం చేశారు.

పాకిస్థాన్ కు ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ద్వారా 88 గంటల ట్రైలర్ చూపించామని, ఇకపై పూర్తి సినిమా చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాల ఉనికి గురించి ప్రపంచానికి ఆధారాలను అందించినట్లు తెలిపారు. చర్చలు, ఉగ్రవాదం ఎన్నటికీ కలిసి సాగవని, రక్తం, నీరు కలిసి ప్రవహించబోవని పాకిస్థాన్‌కు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. బ్లాక్‌మెయిళ్లకు పాల్పడే పరిస్థితుల్లో భారత్ లేదని, శత్రువులను ఎదుర్కోవడానికి దేశంలోని నేతలంతా ఏకతాటిపై పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడినట్లు చెప్పారు.

చైనాతో సంబంధాలపై కూడా ఉపేంద్ర ద్వివేది స్పందించారు. ఇంతకుముందుతో పోలిస్తే చైనాతో సంబంధాలు బలపడుతున్నాయని అన్నారు. సరిహద్దుల నిర్వహణపై తాజాగా ఇరుదేశాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయని అన్నారు. సైనిక, దౌత్య మార్గాల్లో లోతైన చర్చలు జరిపేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులు కొనసాగించేందుకు ఇరుదేశాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Upendra Dwivedi
Pakistan
India
terrorism
Jammu and Kashmir
China
Article 370

More Telugu News