Chandrababu Naidu: సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, జగన్ ప్రగాఢ సానుభూతి

Chandrababu Pawan Jagan Condolences on Saudi Bus Accident
  • సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికుల బస్సు ప్రమాదం
  • మృతుల్లో అత్యధికులు తెలంగాణ వాసులుగా వెల్లడి
  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
  • మాజీ సీఎం జగన్, మంత్రి లోకేశ్, షర్మిల సంతాపం
  • మృతదేహాలను రప్పించాలని కేంద్రానికి షర్మిల విజ్ఞప్తి
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన పలువురు ఉమ్రా యాత్రికులు మరణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురు నేతలు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. "పవిత్ర ఉమ్రా యాత్రలో తెలంగాణకు చెందిన మన సోదర సోదరీమణులు మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు.

మదీనా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 42 మంది భారతీయులు మరణించడం హృదయ విదారకమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు కావడం బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.

మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "సౌదీలో జరిగిన ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రార్థనలు ఉంటాయి" అని జగన్ పోస్ట్ చేశారు.

అదేవిధంగా మంత్రి నారా లోకేశ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని, మృతదేహాలను గౌరవప్రదంగా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని షర్మిల కోరారు.
Chandrababu Naidu
Saudi Arabia bus accident
Umrah pilgrims death
Pawan Kalyan
YS Jagan
Telangana
Andhra Pradesh
Road accident
Nara Lokesh
YS Sharmila

More Telugu News