iBomma: 'ఐబొమ్మ'ను పూర్తిగా మూసివేశాం.. క్షమించండి: ఐబొమ్మ వెబ్‌సైట్‌లో అధికారిక సందేశం

iBomma Website Shut Down Permanently Apology Message
  • ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
  • అతని చేతే వెబ్‌సైట్లను మూయించిన హైదరాబాద్ పోలీసులు
  • దేశంలో సేవలు శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు వెబ్‌సైట్‌లో సందేశం
  • భార్య ఇచ్చిన సమాచారంతో కూకట్‌పల్లిలో పట్టుబడ్డ నిందితుడు
  • కరీబియన్ దీవుల నుంచి పైరసీ దందా నిర్వహణ
తెలుగు సినీ పరిశ్రమకు కొరకరాని కొయ్యగా మారిన పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ తన సేవలను శాశ్వతంగా నిలిపివేసింది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, "మీరు ఇటీవల మా గురించి విని ఉండవచ్చు లేదా మొదటి నుండి మాకు నమ్మకమైన అభిమానిగా ఉండవచ్చు. ఏదేమైనా, మీ దేశంలో మా సేవలు శాశ్వతంగా నిలిపివేయబడ్డాయని చెప్పడానికి మేము చింతిస్తున్నాము. నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నాము" అనే సందేశం కనిపిస్తోంది. ఈ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవల హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి, కరీబియన్ దీవులలో నివసిస్తూ ఐబొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ వెబ్‌సైట్లను నిర్వహిస్తున్నాడు. కొత్త సినిమాల మాస్టర్ ప్రింట్లను దొంగిలించి వాటిని అప్‌లోడ్ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదించాడు. అయితే, తన భార్యతో విడాకుల ప్రక్రియ కోసం భారత్‌కు వచ్చినప్పుడు ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. కూకట్‌పల్లిలోని అతని నివాసంలో రవిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అనంతరం, పోలీసులు రవి చేతే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను పూర్తిగా మూసివేయించారు. ఈ పైరసీ దందా ద్వారా సంపాదించిన డబ్బుతో రవి హైదరాబాద్‌లో సుమారు రూ. 3 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజా పరిణామంతో ఈ రెండు వెబ్‌సైట్లు ఇప్పుడు అందుబాటులో లేకుండా పోయాయి.
iBomma
iBomma website
Immidi Ravi
piracy website
Telugu movies
Baddam TV
Hyderabad police
movie piracy
pirated movies
anti piracy

More Telugu News