Madan Shah: నా శాపమే ఆర్జేడీని ముంచింది.. 25 సీట్లకే పరిమితమైంది: మాజీ నేత మదన్ షా

Madan Shah Claims His Curse Led to RJDs Poor Performance in Bihar Elections
  • ఆర్జేడీ ఓటమికి తన శాపమే కారణమన్న మాజీ నేత మదన్ షా
  • 25 సీట్లకే పరిమితం కావాలని శపించా, అదే నిజమైందని వ్యాఖ్య
  • టికెట్ కోసం రూ.2.7 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణ
  • పార్టీలోని ఓ 'చాణక్యుడి' వల్లే ఆర్జేడీ నాశనమవుతోందన్న విమర్శలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయంపై ఆ పార్టీ మాజీ నేత మదన్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే పార్టీ కేవలం 25 సీట్లకే పరిమితమైందని ఆయన అన్నారు. పార్టీ ఓటమి తనను తీవ్రంగా బాధించిందని, అయితే తన శాపం ఫలించిందని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

"పార్టీ ఓటమి నన్ను పిచ్చివాడిని చేసింది. ఈ బాధతో పాట్నాలో లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిసేందుకు వెళ్లాను. కానీ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. తీవ్ర దుఃఖంతో నా బట్టలు నేనే చించుకుని, కిందపడిపోయి.. ఆర్జేడీ 25 సీట్లకే పరిమితం కావాలని శపించాను. ఇప్పుడు అదే నిజమైంది" అని మదన్ షా వివరించారు. పార్టీలో 'చాణక్యుడు'గా పిలవబడే ఓ సీనియర్ నేత పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అతడిని తొలగించే వరకు ఆర్జేడీ బాగుపడదని ఆరోపించారు.

టికెట్ కోసం తనను రూ.2.7 కోట్లు డిమాండ్ చేశారని వచ్చిన ఆరోపణలపై మాట్లాడుతూ.. ఆ డబ్బును తనను నేరుగా ఎవరూ అడగలేదని, మీడియా ద్వారా ఈ ప్రచారం జరిగిందని స్పష్టం చేశారు. ఈసారి టికెట్ల పంపిణీలో లాలూ ప్రసాద్ యాదవ్‌ను సంప్రదించలేదని, అందుకే పార్టీకి ఈ గతి పట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ ఎన్డీఏ కూటమి 202 సీట్లు గెలుచుకుని భారీ విజయం సాధించింది. మహాఘట్‌బంధన్ కేవలం 35 సీట్లకే పరిమితం కాగా, అందులో ఆర్జేడీ 25 సీట్లతో సరిపెట్టుకుంది. 2020లో 75 సీట్లు గెలిచిన ఆర్జేడీకి ఇది అతిపెద్ద పరాజయం. కాగా, అక్టోబర్‌లో టికెట్ నిరాకరించడంతో మదన్ షా.. పాట్నాలో లాలూ కారును వెంబడిస్తూ, బట్టలు చించుకుని నిరసన తెలిపిన విషయం తెలిసిందే.
Madan Shah
RJD
Bihar Assembly Elections
Lalu Prasad Yadav
Bihar Politics
RJD defeat
Bihar Elections 2024
Mahagathbandhan
NDA alliance
Indian Politics

More Telugu News