భారత్లో ఆశ్రయం పొందుతూ తొలిసారి నోరువిప్పిన షేక్ హసీనా... యూనస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు
- మహ్మద్ యూనస్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపణ
- దేశంలో హిందూ, ఇతర మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన
- రాబోయే ఎన్నికలు కేవలం ఓ నాటకమని, ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వ్యాఖ్య
- ఉగ్రవాద సంస్థలతో కొత్త ప్రభుత్వం అంటకాగుతోందని తీవ్ర విమర్శలు
గతేడాది ఆగస్టు 5న తనను హింసాత్మకంగా అధికారం నుంచి తొలగించారని, విద్యార్థుల నిరసనలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు కుట్ర పన్నాయని హసీనా ఆరోపించారు. తన తండ్రి, జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ చారిత్రక నివాసాన్ని ధ్వంసం చేయడం ద్వారా విమోచన యుద్ధ స్ఫూర్తిని చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలు కేవలం నామమాత్రమేనని, అది రాజ్యాంగ విరుద్ధమైన పాలనను చట్టబద్ధం చేసే ఒక బూటకమని ఆమె అభివర్ణించారు. తన అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు.
యూనస్ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో హిందువులు, ఇతర మైనారిటీలపై వ్యవస్థీకృతంగా దాడులు జరుగుతున్నాయని హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వారికి రక్షణ కల్పించడంలో విఫలమవడమే కాకుండా, ఈ దాడులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. తన 15 ఏళ్ల పాలనలో మతసామరస్యాన్ని కాపాడానని గుర్తుచేశారు. ప్రస్తుత కష్టకాలంలో తనకు తాత్కాలిక ఆశ్రయం కల్పించినందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్ భవిష్యత్తును ఆ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలని, ఈ విషయాన్ని భారత్ అర్థం చేసుకుంటుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.