BRS MLAs: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

BRS MLAs Defection Case Supreme Court Hearing Today
  • అసెంబ్లీ స్పీకర్‌కు అక్టోబర్‌ 31తో ముగిసిన గడువు
  • మరో 8 వారాల పొడిగింపు కోరిన స్పీకర్‌ కార్యాలయం
  • స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేసిన కేటీఆర్
  • ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మరో పిటిషన్‌
  • సీజేఐ జస్టిస్‌ గవాయి ధర్మాసనం ముందుకు అన్ని పిటిషన్లు
బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ పూర్తి చేయడానికి అసెంబ్లీ స్పీకర్‌కు అక్టోబర్‌ 31 వరకు సర్వోన్నత న్యాయస్థానం గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ గడువు ముగియడంతో, మరో 8 వారాల సమయం కావాలని స్పీకర్‌ కార్యాలయం కోర్టును అభ్యర్థించింది.

అసెంబ్లీ కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనల కారణంగా స్పీకర్‌ బిజీగా ఉన్నారని, అందుకే విచారణ పూర్తి చేయలేకపోయారని స్పీకర్ కార్యాలయం తన అభ్యర్థనలో పేర్కొంది. అయితే, స్పీకర్‌ ఉద్దేశపూర్వకంగానే విచారణలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి మరో పిటిషన్‌ వేశారు.

ఈ పిటిషన్లన్నింటినీ కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌, జస్టిస్‌ అంజారియాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించనుంది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్‌, కడియం శ్రీహరి వంటి వారిని స్పీకర్‌ ఇంతవరకు విచారించలేదన్న అంశాన్ని బీఆర్‌ఎస్‌ ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ నెల 23న సీజేఐ జస్టిస్‌ గవాయి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ కేసుపై ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారా? లేక మరో ధర్మాసనానికి బదిలీ చేస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
BRS MLAs
Telangana Politics
KTR
Supreme Court
MLA Disqualification
Speaker office
BR Gavai
Kadiyam Srihari
Danam Nagender
Party Defection

More Telugu News