Padmavathi Ammavari: పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Padmavathi Ammavari Karthika Brahmotsavam Begins with Ankurarpanam
  • నేటి నుంచి పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు
  • అంకురార్పణ  క్రతువులో పాల్గొన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ 
  • ఈ నెల 25వ తేదీ వరకు ఘనంగా ఉత్సవాలు
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కార్తిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరిగింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.  

అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడషోపచారాలు సమర్పించారు. సమస్తమైన విఘ్నాలు తొలగేందుకు విష్వక్సేనారాధన నిర్వహించారు. ఆ తరువాత స్థల శుద్ధి, ద్రవ్యశుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యహవచనం చేపట్టారు. పుణ్యమైన మంత్రాలను పఠించి కలశంలోని నీటిని శుద్ధి చేయడాన్ని పుణ్యహవచనం అంటారు. సభాపూజలో భాగంగా భగవంతునికి సాష్టాంగ ప్రణామం సమర్పించి అనుజ్ఞ తీసుకున్నారు. యాగశాలలో ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయాన్ని రుత్విక్‌ వరణంలో వివరించారు.
 
అంకురార్పణ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం మృత్సంగ్రహణం. అమ్మవారి ఆలయం వద్దగల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శ్రీభూవరాహస్వామివారిని ప్రార్థించి, గాయత్రి అనుష్టానం, భూసూక్తం పారాయణం చేశారు. ధూపదీప నైవేద్యం సమర్పించి మాషాచోప(మినుముల అన్నం) బలిహరణ చేశారు. ఆ ప్రాంతాన్ని గోమూత్రం, గోమేయంతో శుద్ధి చేసి భూమాతను ఆవాహన చేసి వస్త్రసమర్పణ గావించారు. 

భూమాత ఉద్వాసన అనంతరం పుట్టమన్ను తీసుకుని ఆలయానికి వేంచేపు చేశారు. యాగశాలలో వాస్తుదోష నివారణ కోసం హవనం నిర్వహించారు. ఆ తరువాత పాలికల్లో మట్టిని, నవధాన్యాలను ఉంచి పసుపునీళ్లు చల్లి బీజవాపనం చేపట్టారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో వి. వీరబ్రహ్మం, సీవీఎస్వో కె.వి.మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ  ఈఓ హరీంద్రనాథ్, అర్చకులు బాబు స్వామి, అర్చకులు, పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
Padmavathi Ammavari
Tiruchanoor
Karthika Brahmotsavam
TTD
Ankurarpanam
Anil Kumar Singhal
V Veerabrahmam
Hindu Festival

More Telugu News