Manchu Lakshmi: అదొక చేదు అనుభవం: మంచు లక్ష్మి

Manchu Lakshmi Shares Bitter Experience of Sexual Harassment
  • 15 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానన్న మంచు లక్ష్మి
  • పబ్లిక్ బస్సులో తొలి ప్రయాణంలోనే దారుణ ఘటన
  • సెలబ్రిటీ కుటుంబం నుంచి వచ్చినా తప్పలేదని ఆవేదన
  • సామాన్య మహిళల కష్టాలు తలచుకుంటే భయమేస్తోందని వ్యాఖ్య
  • మహిళల భద్రతపై సమాజం దృష్టి పెట్టాలని పిలుపు
నటి, నిర్మాత మంచు లక్ష్మి తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. 15 ఏళ్ల వయసులో పబ్లిక్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని, ఆ భయంకర ఘటన తనను ఇప్పటికీ వెంటాడుతోందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సెలబ్రిటీ కుటుంబం నుంచి వచ్చిన తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సామాన్య మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్నప్పుడు తాను ఎప్పుడూ సొంత వాహనంలోనే ప్రయాణించేదాన్నని, బాడీగార్డులు ఉండేవారని లక్ష్మి గుర్తుచేసుకున్నారు. అయితే, పరీక్షల హాల్ టికెట్ల కోసం స్కూల్ యాజమాన్యం విద్యార్థులను పబ్లిక్ బస్సులో తీసుకెళ్లిందని వెల్లడించారు. అదే తన మొదటి బస్సు ప్రయాణమని, ఎంతో ఉత్సాహంగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను అసభ్యంగా తాకడంతో షాక్‌కు గురయ్యానని ఆమె తెలిపారు.

ఆ క్షణంలో ఏం జరిగిందో కూడా తనకు అర్థం కాలేదని, భయంతో వణికిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం స్నేహితులతో పంచుకున్న తర్వాత కాస్త ధైర్యం వచ్చిందన్నారు. రోజూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే మహిళలు ఇలాంటి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ మౌనంగా భరిస్తున్నారని ఆమె అన్నారు.

ఎంతో మంది మహిళలు తమకు ఎదురయ్యే వేధింపుల గురించి బయటకు చెప్పుకోలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని మంచు లక్ష్మి పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం సమాజం బాధ్యత తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆమె పిలుపునిచ్చారు.
Manchu Lakshmi
Manchu Lakshmi interview
sexual harassment
public transport
women safety
childhood experience
celebrity experience
Hyderabad
Tollywood

More Telugu News