పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ట్రోల్ చేసిన ఆకాశ్ చోప్రా.. పాకిస్థాన్ పరువు తీశారుగా!

  • శ్రీలంకపై వన్డే సిరీస్ గెలిచిన పాకిస్థాన్
  • జట్టును అభినందిస్తూ ట్వీట్ చేసిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
  • ప్రధాని ట్వీట్‌పై వ్యంగ్యంగా స్పందించిన ఆకాశ్ చోప్రా
భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శ్రీలంకపై వన్డే సిరీస్ గెలిచినందుకు పాక్ జట్టును అభినందిస్తూ షరీఫ్ చేసిన ట్వీట్‌పై చోప్రా ఘాటుగా స్పందించారు. ఒక ద్వైపాక్షిక సిరీస్ విజయాన్నే గొప్పగా చెప్పుకుంటున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు.

వివరాల్లోకి వెళ్తే, రావల్పిండి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్థాన్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ విజయంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శనివారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ జట్టును, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని అభినందించారు. ఇస్లామాబాద్‌లో పేలుడు ఘటన జరిగినప్పటికీ సిరీస్‌లో పాల్గొన్నందుకు శ్రీలంక ఆటగాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అయితే, షరీఫ్ చేసిన ఈ ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా స్పందిస్తూ, "ఒక ద్వైపాక్షిక సిరీస్ గెలవడం మాత్రమే మీకు గొప్పగా చెప్పుకోవడానికి మిగిలినప్పుడు ఇలాగే ఉంటుంది" అంటూ సెటైర్ వేశారు. ఈ ఒక్క వ్యాఖ్యతో ఐసీసీ టోర్నీలలో పాకిస్థాన్ పేలవ ప్రదర్శనను ఆయన పరోక్షంగా గుర్తుచేశారు.

2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత పాకిస్థాన్ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టోర్నీలోనూ విజేతగా నిలవలేదు. 2021 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్, 2022లో ఫైనల్‌లో ఓటమి పాలైంది. ఇక 2023 వన్డే ప్రపంచకప్, 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలలో పాకిస్థాన్ కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోయింది. ఈ నేపథ్యంలోనే చోప్రా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


More Telugu News