Rajamouli: రాజమౌళి, మహేశ్ బాబు సినిమా రిలీజ్ ఎప్పుడంటే...!

Rajamouli Mahesh Babu Movie Release in 2027
  • రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్ లో వరల్డ్ క్లాస్ మూవీ
  • భారీ యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో చిత్రం
  • హైదరాబాదులో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్
  • 2027 వేసవిలో రిలీజ్
యావత్ భారత సినీ ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లోని ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన అతిపెద్ద అప్‌డేట్ వచ్చేసింది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ఖరారు చేసింది. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్‌ను 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం అట్టహాసంగా నిర్వహించిన ‘గ్లోబ్‌ట్రాటర్’ (Globetrotter) ఈవెంట్‌లో ఈ కీలక ప్రకటన చేశారు. 

ఈ కార్యక్రమాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ, యువ నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కేఎల్ నారాయణ మాట్లాడుతూ 15 ఏళ్ల తన నిరీక్షణను పంచుకున్నారు. “పదిహేనేళ్ల క్రితం రాజమౌళిగారితో సినిమా చేద్దామని అడిగాను, ఆయన వెంటనే ఒప్పుకున్నారు. కానీ ఇంత సమయం పడుతుందని మేమిద్దరం ఊహించలేదు. ఈ మధ్యలో ఆయనకు ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి భారీ విజయాలు వచ్చాయి. దర్శకుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగినా, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. సూపర్‌స్టార్ కృష్ణగారి లాగే మహేశ్ బాబు కూడా నిర్మాతల హీరో. ఇన్నేళ్లు ఓపికగా ఎదురుచూశారు. ఈ సినిమాలో భాగమైనందుకు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మహేశ్ బాబు గారికి కృతజ్ఞతలు” అని తెలిపారు.

ఈ సినిమా సహ నిర్మాత, రాజమౌళి-రమా దంపతుల తనయుడు కార్తికేయ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. “ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత త్వరగా వస్తుందని నేను ఊహించలేదు. ఇందులో పనిచేస్తున్న వారందరూ లెజెండ్స్. ఇది నాకు దక్కిన అదృష్టం. ఈ సినిమాతో భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి, ప్రపంచ ప్రేక్షకులను భారత సినిమా వైపు చూసేలా చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కోసం 15 ఏళ్లు వేచి చూసిన కేఎల్ నారాయణ గారికి నా ధన్యవాదాలు” అని కార్తికేయ అన్నారు. ఆయన మాటలకు తల్లి రమా రాజమౌళి కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారిని కదిలించింది.

ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ఆయన మాట్లాడుతూ, “ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూశాను. అందులో సీజీ లేదు, డబ్బింగ్ లేదు, రీ-రికార్డింగ్ కూడా లేదు. అయినా మహేశ్ నటనను చూసి మంత్రముగ్ధుడిని అయిపోయాను. అదొక మరచిపోలేని అనుభూతి. కొన్ని సినిమాలను మనుషులు తీస్తారు, కానీ కొన్ని సినిమాలు దైవ నిర్ణయం వల్ల రూపుదిద్దుకుంటాయి. రాజమౌళి గుండెపై హనుమంతుడు ఉన్నాడు. ఆయనే కర్తవ్యాన్ని బోధిస్తూ ఈ ప్రాజెక్టును మా ద్వారా నడిపిస్తున్నాడు” అంటూ సినిమా స్థాయిని, మహేశ్ నటనలోని తీవ్రతను కొనియాడారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రకటనలతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.
Rajamouli
Mahesh Babu
SS Rajamouli
Mahesh Babu movie
Globetrotter event
KL Narayana
SS Karthikeya
Priyanka Chopra
Prithviraj Sukumaran
Vijayendra Prasad

More Telugu News