KTR: 'కర్మ ఈజ్ బ్యాక్' అని నీ సొంత చెల్లి చెబుతోంది: కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత ఆగ్రహం

KTR Congress Leader Slams KTR Over Karma Remark
  • చింత చచ్చినా పులుపు తగ్గలేదన్నట్లు కేటీఆర్ తీరు ఉందన్న ఆది శ్రీనివాస్
  • జూబ్లీహిల్స్‌లో ఓడిపోయినా అహంకారం తగ్గలేదని విమర్శలు
  • జూబ్లీహిల్స్ ప్రజల ముందు బీఆర్ఎస్ గిమ్మిక్కులు చిత్తయ్యాయని వ్యాఖ్య
"కర్మ ఈజ్ బ్యాక్" అని స్వయానా మీ చెల్లెలు చెబుతున్నారని, మీ బతుకు, మీ పార్టీ బతుకు గురించి కనీసం ఆమె చెబుతుంటే అయినా తెలుసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చింత చచ్చినా పులుపు తగ్గనట్లుగా కేటీఆర్ పరిస్థితి ఉందని అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోయినప్పటికీ ఆయనలో అహంకారం తగ్గలేదని విమర్శించారు.

ప్రజలు ఛీకొట్టి 12 గంటలు కాకముందే మీడియా ముందుకు వచ్చి తన బలుపును చూపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గుర్తును గాడిదపై ఎక్కించి ఊరేగించామా అంటూ అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఓటర్ల ముందు కేటీఆర్, బీఆర్ఎస్ గిమ్మిక్కులు చిత్తయ్యాయని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం, ఫేక్ సర్వేలతో మైండ్ గేమ్ ప్లే చేసినా ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు.

ఒక్క ఎన్నికలో కాంగ్రెస్ గెలిచిందని కేటీఆర్ అంటున్నారని, కానీ అసెంబ్లీ ఎన్నికలు మొదలు ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌ను చిత్తు చేశామని అన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. నోరు మూసుకుంటే కొన్నాళ్లైనా బీఆర్ఎస్ తెలంగాణలో బతుకుతుందని, లేదంటే కేటీఆర్ నోటిమాటకే బీఆర్ఎస్ మట్టికరుస్తుందని ఆది శ్రీనివాస్ అన్నారు.
KTR
K Taraka Rama Rao
Aadi Srinivas
Congress
BRS
Telangana Politics
Jubilee Hills

More Telugu News