Maruti Suzuki: వేల సంఖ్యలో గ్రాండ్ విటారా కార్లను వెనక్కి పిలిపించిన మారుతి సుజుకి... కారణం ఇదే!

Maruti Suzuki Recalls Grand Vitara Over Fuel Indicator Issue
  • మారుతి సుజుకి నుంచి 39,506  గ్రాండ్ విటారా కార్ల రీకాల్
  • ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్‌లో లోపం ఉన్నట్లు గుర్తింపు
  • డిసెంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య తయారైన వాహనాల్లో సమస్య
  • లోపమున్న స్పీడోమీటర్ అసెంబ్లీని ఉచితంగా మార్చనున్న కంపెనీ
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన ప్రముఖ మోడల్ గ్రాండ్ విటారాకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్‌లో లోపం కారణంగా 39,506 గ్రాండ్ విటారా యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది.

2024 డిసెంబర్ 9 నుంచి 2025 ఏప్రిల్ 29 మధ్య తయారైన వాహనాల్లో ఈ సమస్యను గుర్తించినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ వాహనాల్లోని ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ ఇంధన స్థాయిని సరిగ్గా చూపించకపోవచ్చని తెలిపింది. సమస్య ఉన్న స్పీడోమీటర్ అసెంబ్లీని ఉచితంగా తనిఖీ చేసి, అవసరమైతే మార్చి ఇస్తామని స్పష్టం చేసింది. ప్రభావిత వాహన యజమానులను మారుతి అధీకృత డీలర్ వర్క్‌షాప్‌లు సంప్రదిస్తాయని కంపెనీ వివరించింది.

మరోవైపు అమ్మకాల్లో మారుతి సుజుకి దూకుడు ప్రదర్శిస్తోంది. గత అక్టోబర్‌లో మొత్తం 2,20,894 యూనిట్లను విక్రయించి, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే సమయంలో దేశీయ అమ్మకాలు 1,80,675 యూనిట్లకు చేరి ఆల్-టైమ్ రికార్డు సృష్టించాయి.

ఇటీవలే దేశీయ మార్కెట్లో 3 కోట్ల కార్ల అమ్మకాల మైలురాయిని దాటిన మారుతి, సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 3,349 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
Maruti Suzuki
Grand Vitara
Maruti Suzuki Grand Vitara
Car recall
Fuel level indicator
Automobile industry
Indian auto market
Car sales
Vehicle recall
Auto news

More Telugu News