Kavitha: హరీశ్‌రావుపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత

Kavitha Fires Again at Harish Rao Alleging Betrayal
  • హరీశ్‌రావు నైజం మోసం చేయడమేనన్న కవిత
  • పార్టీలో ఉంటూనే హరీశ్ ద్రోహం చేశారని ఆరోపణ
  • కేటీఆర్ సోషల్ మీడియా వదిలి బయటకు రావాలని హితవు
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావుపై జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మోసం చేయడమే ఆయన నైజమని, పార్టీలో ఉంటూనే ద్రోహం చేశారని ఆమె ఆరోపించారు. ఈరోజు మెదక్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీశ్‌రావుకు అలవాటని, ఆయన గురించి గట్టిగా మాట్లాడినందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపారని గుర్తుచేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రస్తావిస్తూ, 15 మంది ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతివ్వాలని తనను అడిగితే తనకు సంబంధం లేదని చెప్పానని, అయితే వారే హరీశ్‌రావు వద్దకు వెళ్లగా ‘మీ ఇష్టం’ అని ఆయన సమాధానమిచ్చారని కవిత ఆరోపించారు. తాను బీఆర్ఎస్‌లో లేను కాబట్టి దూరంగా ఉన్నానని, కానీ పార్టీలో కీలక నేతగా ఉన్న హరీశ్‌రావు ఇలా వ్యవహరించడం మోసం చేయడమేనని అన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు పేరుకే కృష్ణార్జునులని, ట్వీట్లు చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని విమర్శించారు.

బీఆర్ఎస్ నేతలు తమ ఆస్తులు పెంచుకున్నారు కానీ, పార్టీ కేడర్‌ను పెంచుకోలేదని కవిత దుయ్యబట్టారు. జగదీశ్ రెడ్డి, మదన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి వారికి వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఒకప్పుడు కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించి పార్టీని వీడిన పద్మా దేవేందర్‌రెడ్డికి ఇప్పుడు హరీశ్‌రావు ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు. మరోవైపు, ప్రస్తుత ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగాల కల్పనలో విఫలమైందని, యువతకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. హరీశ్‌రావు బినామీలకు, వారి కంపెనీలకు ముఖ్యమంత్రితో సంబంధాలున్నాయని కూడా ఆమె ఆరోపించారు.
Kavitha
Harish Rao
BRS Party
Telangana Politics
Medak
KTR
Padma Devender Reddy
Jubilee Hills
Telangana Government
Group 1 Exams

More Telugu News