Temba Bavuma: బవుమా ఎత్తుపై బుమ్రా కామెంట్.. వివాదాన్ని తోసిపుచ్చిన సఫారీలు

South Africa Breaks Silence On Bauna Remark At Temba Bavuma By Indian Stars Jasprit Bumrah
  • బుమ్రా, పంత్ మధ్య స్టంప్ మైక్ సంభాషణపై వివాదం
  • బవుమాను ఉద్దేశించి 'బౌనా' అని బుమ్రా వ్యాఖ్య
  • ఈ వ్యాఖ్యలను పట్టించుకోబోమన్న దక్షిణాఫ్రికా కోచ్ యాష్‌వెల్ ప్రిన్స్
  • ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఘటన
  • ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదని స్పష్టీక‌ర‌ణ‌
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మధ్య చోటుచేసుకున్న స్టంప్ మైక్ వివాదంపై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ యాష్‌వెల్ ప్రిన్స్ స్పందించారు. ఈ ఘటనను తాము పెద్దదిగా చూడటం లేదని, దీనిపై తమ జట్టులో ఎలాంటి చర్చ జరగదని స్పష్టం చేశారు. మైదానంలో జరిగిన దానికి ప్రాధాన్యత ఇవ్వబోమని స్పష్టం చేశారు. 

ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆటలో ఈ ఘటన జరిగింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 13వ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో బవుమాపై ఎల్బీడబ్ల్యూ అప్పీల్ రాగా, అంపైర్ తిరస్కరించారు. డీఆర్ఎస్ తీసుకోవాలా? వద్దా? అని వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో చర్చిస్తున్న సమయంలో.. 'బౌనా భీ హై' (పొట్టిగా కూడా ఉన్నాడు) అని బుమ్రా అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. హిందీలో 'బౌనా' అనే పదాన్ని మరుగుజ్జు వ్యక్తులను ఉద్దేశించి వాడతారు. పొట్టిగా ఉన్న వారిని ఇలా అనడం అవమానకరంగా భావిస్తారు.

ఈ వివాదంపై తొలిరోజు ఆట అనంతరం యాష్‌వెల్ ప్రిన్స్ మాట్లాడుతూ.. "ఈ విషయం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. దీనిపై మేం ఎలాంటి చర్చ చేయబోం. మైదానంలో జరిగిన వాటిని మేం సమస్యగా చూడటం లేదు" అని తెలిపారు. దక్షిణాఫ్రికా జట్టు దీనిపై ఎలాంటి అధికారిక ఫిర్యాదు చేయడం లేదని స్పష్టం చేసింది.

ఇక, కాలి గాయం నుంచి కోలుకుని టెస్టు కెప్టెన్‌గా తిరిగి జట్టులోకి వచ్చిన బవుమా ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అతను 11 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.


Temba Bavuma
Jasprit Bumrah
South Africa
India
Cricket
Stump Mic Controversy
Ashwell Prince
Eden Gardens
Kuldeep Yadav
Rishabh Pant

More Telugu News