RJD: బీహార్ ఫలితాలు.. ఆర్జేడీ ఆవిర్భావం నుంచి రెండో అతిపెద్ద దారుణ ఓటమి

RJD Second Worst Defeat Since Inception Bihar Election Results
  • 143 స్థానాల్లో పోటీ చేసి 25 సీట్లకు పరిమితమైన ఆర్జేడీ
  • 2000 నుంచి ఇప్పటి వరకు ఇది రెండో దారుణ పరాజయం
  • 2010లో 22 సీట్లు మాత్రమే గెలుచుకున్న ఆర్జేడీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి 204 స్థానాల్లో విజయదుందుభి మోగించగా, ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి మాత్రం 33 స్థానాలకే పరిమితమైంది. ఆర్జేడీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి ఇది రెండో దారుణ ఓటమిగా చెప్పవచ్చు. మహాఘట్‌బంధన్ కూటమి మొత్తం 33 సీట్లలో విజయం సాధించగా, అందులో ఆర్జేడీ 25, కాంగ్రెస్ 5 స్థానాలను దక్కించుకున్నాయి. బీహార్ ఎన్నికల్లో చరిత్రలో 2010 సంవత్సరం మినహాయిస్తే, ఆర్జేడీ ఇంత తక్కువ స్థానాలు ఎప్పుడూ గెలుచుకోలేదు.

మహాఘట్‌బంధన్‌లో కీలకమైన పార్టీగా ఉన్న ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేసి, చాలా కష్టంగా పాతిక స్థానాలను అందుకుంది. బీహార్‌లో ఆర్జేడీ గత మూడు దశాబ్దాలుగా బలీయమైన రాజకీయ శక్తిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

1997లో లాలూ ప్రసాద్ యాదవ్ జేడీయూని స్థాపించారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో తన రాజకీయ బలాన్ని చాటుకుంది. 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 124 సీట్లు, 2005 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 71, 2005 అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 54 సీట్లు గెలుచుకుంది.

2010లో ఎన్డీయే హవా బలంగా ఉన్న సమయంలో ఆర్జేడీ కేవలం 22 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి పుంజుకుని 80 సీట్లు సాధించింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు సాధించి బీహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ఇప్పుడు ఆర్జేడీ 25 సీట్లకు పరిమితం కావడం గమనార్హం.

రెండు దశాబ్దాలకు పైగా బీహార్‌లో బలీయమైన రాజకీయ శక్తిగా ఉన్న ఆర్జేడీ ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లోనూ అన్ని పార్టీల కంటే ఆర్జేడీ ఓటు బ్యాంకు ఎక్కువగా నమోదైంది. తాజా ఫలితాల్లో ఆర్జేడీకి 22.9 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 20.1 శాతం, జేడీయూకు 19.24 శాతం ఓట్లు వచ్చాయి.
RJD
Bihar Election Results
Lalu Prasad Yadav
Bihar Assembly Elections
Mahagathbandhan

More Telugu News