Nara Lokesh: ఏపీకి పెట్టుబడుల వెల్లువ... చంద్రబాబు, లోకేశ్ సమక్షంలో కీలక ఒప్పందాలు

Nara Lokesh Secures Massive Investments at Vizag CII Summit
  • విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
  • రూ.27,909 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు
  • 53,879 మందికి ఉద్యోగ అవకాశాలు
  • ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యమన్న లోకేశ్
  • చంద్రబాబు సమక్షంలో సింగపూర్‌తో అవగాహన ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఒకే రోజు విశాఖపట్నం, విజయవాడ వేదికలుగా జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు శ్రీకారం చుట్టింది. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో రూ.27,909 కోట్ల విలువైన పెట్టుబడులకు 17 ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సింగపూర్ ప్రభుత్వంతో కీలక రంగాల్లో సహకారానికి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) జరిగింది.

ఎలక్ట్రానిక్స్ హబ్‌గా ఏపీ.. భారీ పెట్టుబడులకు ఒప్పందాలు

విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ హబ్‌గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 

"2014-19 మధ్య తిరుపతి కేంద్రంగా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేశాం. గత ఐదేళ్లు కొంత ఆటంకం ఏర్పడినా, ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయిలో దృష్టి సారించాం. పారిశ్రామికవేత్తలు తిరిగి ఏపీకి రావాలని, పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నాం" అని లోకేశ్ పిలుపునిచ్చారు. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నినాదంతో, క్లస్టర్ విధానంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. 2030 నాటికి సెమీకండక్టర్ రంగంలో ఏపీని ప్రధాన భాగస్వామిగా నిలుపుతామని, రాష్ట్రానికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించడమే లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

సింగపూర్‌తో కీలక ఒప్పందం.. సీఎం చంద్రబాబు హర్షం

విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్ హోం శాఖామంత్రి షణ్ముగం సమక్షంలో ఏపీ ప్రభుత్వం, సింగపూర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అర్బన్ గవర్నెన్స్, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్స్, సుస్థిరాభివృద్ధి వంటి అంశాల్లో పరస్పర సహకారానికి ఈ ఒప్పందం భరోసాను ఇస్తుంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, సింగపూర్ అభివృద్ధి నమూనా తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు. 

"లీక్వాన్యూ వంటి నేతల వల్లే సింగపూర్ అద్వితీయ దేశంగా మారింది. అమరావతి బృహత్ ప్రణాళికను రూపొందించి ఇచ్చిన సింగపూర్‌కు ధన్యవాదాలు. మధ్యలో కొన్ని సమస్యలు వచ్చినా, రాజధానిని పునర్నిర్మిస్తున్నాం. రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం" అని ఆయన పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, "ఈ ఎంఓయూ ఓ అద్భుతమైన ప్రయాణానికి నాంది. రెండో ఛాన్స్ ఇచ్చినందుకు సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు. సింగపూర్ అభివృద్ధి వేగాన్ని ఏపీ అందుకునేలా పని చేస్తాం" అని చెప్పారు.

సింగపూర్ హోం మంత్రి షణ్ముగం మాట్లాడుతూ, ఏపీతో తమ బంధం బలంగా ఉందని, 'హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ'గా ఏపీని మార్చే విజన్‌కు తమ సహకారం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, విజయవాడ-సింగపూర్ మధ్య వారానికి మూడు రోజుల పాటు విమాన సర్వీసులు నడుపుతామని ప్రకటించారు.

మరోవైపు మంత్రి లోకేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమయ్యారు.

ఆస్ట్రేలియా ప్రతినిధులతో భేటీ: ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సిలాయ్ జాకి, జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమైన లోకేశ్, రాష్ట్రంలోని 1057 కిలోమీటర్ల సువిశాల సముద్రతీరాన్ని దృష్టిలో ఉంచుకుని మారిటైమ్, తీరప్రాంత పరిశోధనలకు ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలని కోరారు. పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

శ్యామ్ మెటాలిక్స్‌తో చర్చలు: శ్యామ్ మెటాలిక్స్ ఎండీ షీజిత్ అగర్వాల్‌తో భేటీ అయిన లోకేశ్, అనకాపల్లి సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా డౌన్‌స్ట్రీమ్ స్టీల్ ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.

కిర్లోస్కర్ బ్రదర్స్‌కు ఆహ్వానం: కిర్లోస్కర్ బ్రదర్స్ ఎండీ అలోక్ కిర్లోస్కర్‌తో సమావేశమై, రాష్ట్ర గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా హైడ్రో టర్బైన్లు, సౌర పంపింగ్ వ్యవస్థల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ ఆహ్వానించారు.

ఈ సదస్సులో భాగంగా మంత్రి లోకేశ్ సమక్షంలో 17 ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 53,879 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తిరుపతిలో 'యీమాక్' ప్రైవేట్ లిమిటెడ్ రూ.11,000 కోట్లు, డైకిన్ ఎయిర్ కండిషనింగ్ రూ.2,500 కోట్లు, ఈ-ప్యాక్ గ్రూప్ రూ.1,416 కోట్లు, డిక్సన్ టెక్నాలజీస్ రూ.1,000 కోట్లతో విస్తరణ పనులు చేపట్టనున్నాయి. వీటితో పాటు శ్యామా ఎస్‌జీఎస్, ఎపిటోమ్, హిందాల్కో, నియోలింక్ వంటి పలు సంస్థలు రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి.

ఒప్పందం కుదుర్చుకున్న ప్రధాన కంపెనీలు, వాటి పెట్టుబడుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

ఈమాక్ (Yeemak) ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి - రూ.11,000 కోట్లు (20,500 ఉద్యోగాలు)
డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా, తిరుపతి - రూ.2,500 కోట్లు (2,500 ఉద్యోగాలు)
ఎన్పీఎస్పీఎల్ స్పెషాలిటీ కెమికల్స్, రాష్ట్రవ్యాప్తంగా - రూ.2,400 కోట్లు (400 ఉద్యోగాలు)
ఎస్సీఐసీ వెంచర్స్ ఎల్ఎల్‌పీ, తిరుపతి - రూ.1,704 కోట్లు (2,630 ఉద్యోగాలు)
శ్యామా ఎస్జీఎస్ లిమిటెడ్, తిరుపతి - రూ.1,595 కోట్లు (1,894 ఉద్యోగాలు)
ఈ-ప్యాక్ (Epack) గ్రూప్, తిరుపతి - రూ.1,416 కోట్లు (5,322 ఉద్యోగాలు)
నియోలింక్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి - రూ.1,150 కోట్లు (2,100 ఉద్యోగాలు)
సిప్సా టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి - రూ.1,140 కోట్లు (1,251 ఉద్యోగాలు)
సంవర్థన మదర్సన్ ఇంటర్నేషనల్, రాష్ట్రవ్యాప్తంగా - రూ.1,100 కోట్లు (2,000 ఉద్యోగాలు)
డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా (విస్తరణ), తిరుపతి - రూ.1,000 కోట్లు (10,000 ఉద్యోగాలు)
ఎపిటోమ్ కాంపోనెంట్స్ లిమిటెడ్, తిరుపతి - రూ.700 కోట్లు (1,000 ఉద్యోగాలు)
హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్, తిరుపతి - రూ.586 కోట్లు (613 ఉద్యోగాలు)
అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా, తిరుపతి - రూ.400 కోట్లు (1,500 ఉద్యోగాలు)
మీనా సర్క్యూట్స్ ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి - రూ.350 కోట్లు (819 ఉద్యోగాలు)
రీఫైబ్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం - రూ.350 కోట్లు (450 ఉద్యోగాలు)
సోలమ్ ఇండియా హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి - రూ.268 కోట్లు (700 ఉద్యోగాలు)
టైటాన్ ఇంటెక్ లిమిటెడ్, ఎన్టీఆర్ జిల్లా - రూ.250 కోట్లు (200 ఉద్యోగాలు)

ఈ భారీ పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మరింత బలోపేతం కానుందని ప్రభుత్వం భావిస్తోంది.
Nara Lokesh
Andhra Pradesh investments
CII Summit Visakhapatnam
Singapore agreement AP
Electronics manufacturing hub
Chandrababu Naidu
AP industrial development
Vizag investments
Tirupati electronics cluster
AP Singapore MOU

More Telugu News