Satish Kumar: పరకామణి కేసు విచారణకు వెళుతూ అధికారి మృతి... హత్యేనంటున్న బంధువులు

TTD Parakamani Case Investigator Satish Kumar Death Sparks Controversy
  • టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి
  • పరకామణి కేసు విచారణకు వెళుతుండగా ఘటన
  • తాడిపత్రి సమీపంలో రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యం
  • ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యేనని బంధువుల ఆరోపణ
  • రైలు ఆపి, కిందకు దించి కొట్టి చంపారని తీవ్ర అనుమానం
  • హత్య, ఆత్మహత్య కోణాల్లో పోలీసుల దర్యాప్తు ప్రారంభం
టీటీడీ మాజీ సహాయ విజిలెన్స్ అధికారి (ఏవీఎస్ఓ), ప్రస్తుతం గుంతకల్ రైల్వే ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆయన మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. టీటీడీ పరకామణి కేసులో సీట్ (SIT) విచారణకు హాజరయ్యేందుకు తిరుపతి వెళుతుండగా ఈ ఘటన జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గుంతకల్ నుంచి రైలులో బయలుదేరిన సతీష్ కుమార్, మార్గమధ్యలో విగతజీవిగా కనిపించారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇది ఆత్మహత్య కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యేనని వారు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తమకు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదని, మీడియా ద్వారానే విషయం తెలుసుకుని హుటాహుటిన ఇక్కడికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.

"రైలు నుంచి పడితే మృతదేహం పట్టాల పక్కన కంకరపై పడుతుంది. కానీ, ట్రాక్‌కు దాదాపు 10 మీటర్ల దూరంలో ఎలా పడి ఉంటుంది? రైలును ఆపి, కిందకు దించి కొట్టి చంపారని స్పష్టంగా తెలుస్తోంది" అని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజాయతీగా పనిచేసే అధికారికి ఇలాంటి పరిస్థితి రావడం దారుణమని వాపోయారు.

2023లో టీటీడీ పరకామణి కేసులో సతీష్ కుమార్ ఫిర్యాదుదారుగా ఉన్నారు. ఇటీవల ఈ కేసులో సీఐడీకి ఆయన కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన మరణించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మృతికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Satish Kumar
TTD Parakamani case
railway inspector
Anantapur
Guntakal
SIT investigation
suspicious death
murder investigation
Tadipatri
Andhra Pradesh

More Telugu News