Chandrababu Naidu: అభివృద్ధికి మార్గాలు ఇవే: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Pathways to Andhra Pradesh Development
  • విశాఖపట్నంలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
  • అభివృద్ధికి పెట్టుబడులు, ఆవిష్కరణలే కీలకమన్న సీఎం చంద్రబాబు
  • పరిశ్రమల ఏర్పాటుకు 50 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్
  • ప్రకృతి వ్యవసాయం, ఆక్వా రంగాల్లో ఏపీకి అగ్రస్థానం
  • గ్లోబల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన అరకు కాఫీ
  • కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలం అని వెల్లడి 
పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు, భాగస్వామ్యాలే రాష్ట్ర అభివృద్ధికి మూలస్తంభాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సును కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే చూడొద్దని నెట్వర్కింగ్ కోసం, మేధోపరమైన చర్చల కోసం, ఆవిష్కరణల కోసం ఏర్పాటు చేశామని అన్నారు. 

సౌదీ, రష్యా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, శ్రీలంక, జపాన్, కెనడా తదితర దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కావటం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. పరస్పరం పెట్టుబడుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధించగలమనే విషయాన్ని గుర్తించాలని సీఎం కోరారు. సింగపూర్ చాలా చిన్న దేశమైనా అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చిందని తెలిపారు.

ఏపీ ప్రకృతిసాగులో అగ్రస్థానం... పర్యాటక రంగంలో పెట్టుబడులకు అనుకూలం

ఆర్గానిక్ ఉత్పత్తిగా అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగిందని, ఆక్వా ఉత్పత్తులు, ప్రకృతి వ్యవసాయంలోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని సీఎం వివరించారు. "ఖనిజాలు, రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో కొత్త టెక్నాలజీలతో పని చేసే సంస్థలతో భాగస్వాములయ్యేందుకు ఏపీ సిద్ధంగా ఉంది. ఏపీలోని సుదీర్ఘ తీరప్రాంతం, గండికోట, అరకు లాంటి ప్రకృతి అందాలు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైన ప్రదేశాలు. అలాగే కొత్తగా భారతీయ రుచులకు సంబంధించిన రంగాల్లోనూ విస్తృత అవకాశాలు వినియోగించుకోవచ్చు. 

ఏపీలోని వివిధ ప్రాంతాల్లోని సంప్రదాయాలు, చేతివృత్తులను ప్రోత్సహించేందుకు ఎక్స్ పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. డేటా లేక్, రియల్ టైమ్ డేటా ద్వారా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. సాంకేతికత సాయంతో అతి తక్కువ నష్టంతోనే ప్రకృతి విపత్తులను సమర్ధంగా ఎదుర్కుంటున్నాం. నూతన ఆవిష్కరణలు, యువతకు నైపుణ్యాల కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేశాం" అని ముఖ్యమంత్రి వివరించారు.

అందుబాటులో 50 వేల ఎకరాలు

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు, ప్రాజెక్టుల ఏర్పాటు కోసం 50 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉంచామని సీఎం చంద్రబాబు అన్నారు. మానవాళి సంక్షేమం కోసం అంతా కలిసి పనిచేద్దామని దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులకు, పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉందని అన్నారు. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ మళ్లీ విజయం సాధించిందని, ఎన్టీఏపై నమ్మకం ఉంచిన ప్రజలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సదస్సుకు ఆర్మేనియా, సింగపూర్, మారిషస్, నేపాల్, అంగోలా, వెనిజులా దేశాలకు చెందిన మంత్రులు యూఎన్ఓ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
Chandrababu Naidu
Andhra Pradesh
CII Partnership Summit
Visakhapatnam
Investments
AP Development
Tourism AP
Ratan Tata Innovation Hub
Amaravati
Narendra Modi

More Telugu News