Chandrababu Naidu: సీఎం చంద్రబాబు విజన్ అద్భుతం... ఏపీ అభివృద్ధికి పారిశ్రామిక దిగ్గజాల భరోసా

Chandrababu Naidu Vision Praised at CII Summit
  • విశాఖలో ఘనంగా ప్రారంభమైన 30వ భాగస్వామ్య సదస్సు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతపై పారిశ్రామిక దిగ్గజాల ప్రశంసలు
  • ఏపీ అభివృద్ధిలో భాగస్వాములవుతామని ప్రకటించిన ప్రముఖ సంస్థలు
  • రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించిన అదానీ, జీఎంఆర్, బజాజ్
  • యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడతామన్న పారిశ్రామికవేత్తలు
  • డేటా సెంటర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు బలమైన ఆసక్తి
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో తాము కూడా భాగస్వాములమవుతామని, రాష్ట్ర యువతకు నైపుణ్యాలు అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ అద్భుతమని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడం ఖాయమని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమైన సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సులో పలు దిగ్గజ సంస్థల అధినేతలు పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఏపీ వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్: కరణ్ అదానీ
ఈ సదస్సులో అదానీ పోర్ట్స్, సెజ్ ఎండీ కరణ్ అదానీ మాట్లాడుతూ, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానంతో ఆంధ్రప్రదేశ్ ఆధునిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతోందని అన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్‌గా ఏపీ నిలిచిందని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శిగా నిలుస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఓడరేవులు, సిమెంట్ ఉత్పత్తి వంటి కీలక రంగాల్లో అదానీ సంస్థ ఇప్పటికే పనిచేస్తోందని, భవిష్యత్తులోనూ ఏపీ వృద్ధిలో తమ సంస్థ కీలక భాగస్వామి అవుతుందని ఆయన ప్రకటించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించడంలో మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషిని కరణ్ అదానీ ప్రత్యేకంగా అభినందించారు.

చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా ఎయిర్‌పోర్టులు: గ్రంధి మల్లిఖార్జున రావు
జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లిఖార్జున రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలో భాగస్వామి కావడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఒక సమగ్ర ఏరోస్పేస్ ఎకో సిస్టమ్‌ను సిద్ధం చేస్తున్నామని, భోగాపురం ఎయిర్‌పోర్టులోనే విమానాల మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్ (MRO) కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

సీబీఎన్ జీనోమ్ వ్యాలీ నుంచే కొవిడ్ టీకా: సుచిత్రా ఎల్లా
భారత్ బయోటెక్ ఎండీ, సీఐఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రా కె.ఎల్లా మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్య సవాళ్లను అధిగమిస్తూ భారత్ ముందుకు సాగుతోందన్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత భారత్‌కు దక్కిందని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన జీనోమ్ వ్యాలీ నుంచే భారత్ బయోటెక్ కొవిడ్ టీకాను అభివృద్ధి చేసి అందించిందని, ఆయన దూరదృష్టికి ఇదే నిదర్శనమని వివరించారు.

యువతకు నైపుణ్య కేంద్రాలు: సంజీవ్ బజాజ్
బజాజ్ ఫిన్‌సర్వ్ చైర్మన్ సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక 'గ్రోత్ ఇంజిన్' లాంటిదని అభివర్ణించారు. వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం వాణిజ్యం, సాంకేతికత, ఆవిష్కరణలకు గేట్‌వేగా నిలుస్తోందన్నారు. రాష్ట్ర యువతకు అండగా నిలిచేందుకు విజయవాడ, విశాఖ, రాజమండ్రి, శ్రీసిటీ, తిరుపతిలలో 'రాహుల్ బజాజ్ స్కిల్లింగ్ సెంటర్ల'ను' ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

ఏపీ వృద్ధిలో మేమూ భాగస్వాములం: అమిత్ కల్యాణి, యూసఫ్ అలీ
భారత్ ఫోర్జ్ జాయింట్ ఎండీ అమిత్ కల్యాణి మాట్లాడుతూ, ఏఐ, డేటా యుగంలో చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ముందంజలో ఉందని అన్నారు. ఇప్పటికే రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో రాష్ట్రంలో పనిచేస్తున్నామని, భవిష్యత్తులో నౌకా నిర్మాణం, పర్యాటక రంగాల్లోనూ పెట్టుబడులు పెడతామని తెలిపారు. లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యాధునిక మాల్స్‌తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం చంద్రబాబు కలలకు అనుగుణంగా ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఆయన అన్నారు.
.
Chandrababu Naidu
Andhra Pradesh
AP Development
CII Partnership Summit
Industrial Investment
Karan Adani
GMR
Suchitra Ella
Skill Development
Startup Ecosystem

More Telugu News