Mohammed Anwar: జూబ్లీహిల్స్‌ కౌంటింగ్‌ వేళ విషాదం.. గుండెపోటుతో ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి

Jubilee Hills Independent Candidate Mohammed Anwar Passes Away
  • ఫలితాల ఉత్కంఠతో అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి
  • ఆసుపత్రికి తరలించినప్పటికీ దక్కని ఫలితం
  • యూసఫ్‌గూడ స్టేడియంలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ నడుమ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఒకరైన మహమ్మద్ అన్వర్ (40) గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు.  

వివరాల్లోకి వెళితే, ఎర్రగడ్డలో నివాసముంటున్న అన్వర్ ఉదయం నుంచి జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తీవ్రమైన ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఒత్తిడి, ఆందోళనే ఆయన మరణానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. అన్వర్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాజకీయ వర్గాలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ విషాద ఘటన ఓ వైపు ఆవేదన కలిగిస్తుండగా, మరోవైపు యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 10 రౌండ్లలో, 42 టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తున్నారు. పారదర్శకత కోసం ప్రతి టేబుల్ వద్ద ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో 186 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
Mohammed Anwar
Jubilee Hills
Jubilee Hills Election
Telangana Elections
Heart Attack
Counting
Yousufguda
Kotla Vijaya Bhaskar Reddy Stadium
Independent Candidate
Telangana Politics

More Telugu News