Pawan Kalyan: ఎర్రచందనం స్మగ్లింగ్‌పై పవన్ సంచలన పోస్ట్.. ఆ పుస్తకంలో ఏముంది?

Pawan Kalyan Reviews The Wild East Book on Seshachalam Smuggling
  • 'ది వైల్డ్ ఈస్ట్' పుస్తకంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • శేషాచలం అడవుల దోపిడీకి ఈ పుస్తకం ఒక సాక్ష్యమన్న పవన్
  • కొందరు రాజకీయ నేతలు మాఫియా డాన్లుగా వ్యవహరించారని వ్యాఖ్య
  • చిన్న కాంట్రాక్టర్ ఎర్రచందనం స్మగ్లింగ్ కింగ్‌పిన్‌గా ఎలా ఎదిగాడో వివరణ‌
  • ఇది ప్రజలు, ప్రకృతిపై జరిగిన విశ్వాసఘాతకమని పేర్కొన్న పవన్
  • ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని ‘ఎక్స్’లో సూచన
శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్, సహజ వనరుల దోపిడీకి ‘ది వైల్డ్‌ ఈస్ట్‌’ అనే పుస్తకం సజీవ సాక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ పుస్తకంలోని అంశాలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని పేర్కొంటూ ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. వ్యవస్థ కళ్లెదుటే జరిగిన ఈ దోపిడీ వెనుక రాజకీయ నాయకులు, మాఫియా డాన్ల పాత్రను ఈ గ్రంథం కళ్లకు కట్టినట్టు వివరిస్తోందని తెలిపారు.

పవన్ కల్యాణ్ తన పోస్ట్‌లో "కొంత కాలం క్రితం నేను 'ది వైల్డ్ ఈస్ట్' పుస్తకాన్ని చదవడం ప్రారంభించాను. శేషాచలం అడవులు, తూర్పు కనుమల్లోని ఎర్రచందనం సహా విలువైన సహజ వనరులను వ్యవస్థ కళ్లముందే ఎలా దోచుకుపోయారో ఈ గ్రంథం బహిర్గతం చేస్తుంది. కొంతమంది రాజకీయ నేతలు మాఫియా డానుల్లా ఎలా వ్యవహరించారో ఇందులో బయటపడింది" అని వివరించారు. ఈ పుస్తకంలోని కథనం అత్యంత ఆసక్తికరంగా సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒక చిన్న స్థాయి కాంట్రాక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి, మాఫియాలో కింగ్‌పిన్‌గా ఎదిగి, ఎర్రచందనం అక్రమ రవాణా సామ్రాజ్యానికి అధిపతిగా ఎలా మారాడో దాదాపు ఒక సినిమా సన్నివేశంలా ఈ పుస్తకంలో చూపించారని పవన్ పేర్కొన్నారు. కేవలం ధన దాహం, అధికారం కోసం అతడు నిర్మించిన నేర సామ్రాజ్యం ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.

ఈ పుస్తకాన్ని చదివినప్పుడు కేవలం నేరాన్ని మాత్రమే కాకుండా, దాని వెనుక ఉన్న లోతైన విశ్వాసఘాతకాన్ని కూడా అర్థం చేసుకోగలరని పవన్ అన్నారు. "ప్రజలు ఈ పుస్తకాన్ని చదివినప్పుడు, భూమి, అరణ్యాలు, ప్రకృతి, ప్రజలపై జరిగిన ద్రోహాన్ని లోతుగా అనుభూతి చెందుతారు" అని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు. పవన్ కల్యాణ్ పోస్ట్‌తో ‘ది వైల్డ్‌ ఈస్ట్‌’ పుస్తకంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Pawan Kalyan
The Wild East
Seshachalam
Red Sanders Smuggling
AP Deputy CM
Mafia
Political Corruption
Natural Resources
Book Review
Andhra Pradesh

More Telugu News