FASTag: ఫాస్టాగ్‌ లేని వాహనాలకు శుభవార్త.. యూపీఐ పేమెంట్స్‌కు ప్రత్యేక వెసులుబాటు

FASTag Relief UPI Payments Now Cheaper at Toll Plazas
  • ఫాస్టాగ్‌ లేని వాహనాలకు టోల్ రుసుములో మార్పు
  • యూపీఐ ద్వారా చెల్లిస్తే రెట్టింపు ఛార్జీల నుంచి మినహాయింపు
  • ఇకపై 25 శాతం అదనపు రుసుము మాత్రమే వసూలు
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్‌ లేని వాహనాలు టోల్‌గేట్ల వద్ద యూపీఐ ద్వారా రుసుము చెల్లిస్తే ఇప్పటివరకు విధిస్తున్న రెట్టింపు ఛార్జీల నిబంధనను సడలించింది. ఇకపై కేవలం 25 శాతం అదనపు రుసుము చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం శుక్రవారం తెల్లవారుజాము నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ లేని వాహనాలకు టోల్ రుసుముకు రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. నగదు రూపంలో చెల్లించినా, యూపీఐ ద్వారా చెల్లించినా ఇదే నిబంధన వర్తించేది. అయితే, కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో యూపీఐ ద్వారా చెల్లించే వారికి గణనీయమైన ఊరట లభించనుంది.

ఉదాహరణకు, ఒక వాహనానికి టోల్ రుసుము రూ.100 అనుకుంటే.. ఫాస్టాగ్‌ ఉన్నవారు రూ.100 చెల్లిస్తారు. ఫాస్టాగ్‌ లేనివారు నగదు రూపంలో చెల్లిస్తే రెట్టింపుగా అంటే రూ.200 చెల్లించాలి. కానీ, కొత్త నిబంధన ప్రకారం యూపీఐ ద్వారా చెల్లిస్తే కేవలం రూ.125 (25 శాతం అదనం) చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) అధికారులు టోల్ ప్లాజాల్లో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తున్నట్లు ఓ టోల్‌ప్లాజా అధికారి తెలిపారు. నగదు చెల్లించేవారికి మాత్రం పాత పద్ధతిలోనే రెట్టింపు రుసుము వసూలు చేస్తారని ఆయన స్పష్టం చేశారు.
FASTag
UPI Payments
Toll Tax
National Highways Authority of India
NHAI
Toll Plaza
Road Tax
Digital Payments
India
Highway Tolls

More Telugu News