Sidiri Appalaraju: పలాస కేసు: మాజీ మంత్రి అప్పలరాజును 6 గంటలు ప్రశ్నించిన పోలీసులు

Sidiri Appalaraju Questioned for 6 Hours in Palasa Case
  • పలాస ధర్నా కేసులో విచారణకు హాజరైన మాజీ మంత్రి అప్పలరాజు
  • ప్రశ్నలకు ‘తెలీదు, గుర్తులేదు’ అంటూ సమాధానాలు దాటవేసినట్లు సమాచారం
  • కూటమి ప్రభుత్వం తనపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపణ
  • అధికారంలోకి వచ్చాక తనపై 10 కేసులు నమోదు చేశారని వెల్లడి
  • ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకే వేధిస్తున్నారని వ్యాఖ్య
మాజీ మంత్రి, పలాస మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో గత నెల 13న కల్తీ మద్యంపై అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా ఆయన గురువారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలైన విచారణ రాత్రి 9:45 గంటల వరకు.. దాదాపు ఆరు గంటలకు పైగా కొనసాగింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విచారణలో అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు అప్పలరాజు ‘తెలీదు, జ్ఞాపకం లేదు’ అంటూ దాటవేత ధోరణి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా ర్యాలీ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించగా ‘చట్ట ప్రకారమే చేశాం’ అని ఆయన బదులిచ్చినట్లు సమాచారం. అయితే, ర్యాలీకి అనుమతి ఎందుకు తీసుకోలేదని అధికారులు అడగ్గా, ఆ విషయం తనకు తెలియదని చెప్పినట్లు తెలిసింది. పోలీసులు పలు ఆధారాలు చూపి సమాధానం చెప్పాలని కోరినప్పటికీ, ఆయన ‘నాకేం తెలీదు, గుర్తులేదు’ అనే మాటకే కట్టుబడినట్లు సమాచారం.

విచారణ అనంతరం బయటకు వచ్చిన అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇప్పటివరకు 10 కేసులు నమోదు చేసిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించిన ఘటనపై మాట్లాడినందుకు కూడా తనపై కేసు పెట్టారని అప్పలరాజు ఆక్షేపించారు.
Sidiri Appalaraju
Appalaraju
Palasa case
Kashibugga police
Srikakulam district
Adulterated liquor
Illegal rally
Andhra Pradesh politics
TDP government
Political vendetta

More Telugu News