Pune accident: పుణేలో కంటైనర్లు ఢీకొని భారీగా మంటలు.. మధ్యలో చిక్కుకుపోయిన కారు... 8 మంది మృతి!

Pune Accident 8 Dead in Container Collision Near Navale Bridge
  • పుణే-బెంగళూరు జాతీయ రహదారిలోని నవలే వంతెన సమీపంలో ప్రమాదం
  • క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలింపు
  • కంటైనర్ అతివేగం, బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణం
పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై నవలే వంతెన సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రెండు కంటైనర్ లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కంటైనర్ల మధ్యలో కారు చిక్కుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా సజీవదహనమయ్యారు.

క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఒక కంటైనర్ అతి వేగంగా వచ్చి పలు వాహనాలను ఢీకొంటూ ముందుకు దూసుకెళ్లి మరో కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంటలు వ్యాపించాయని, అదే సమయంలో వాటి మధ్యలో చిక్కుకున్న కారు కూడా మంటల్లో కాలిపోయిందని పోలీసులు తెలిపారు. మృతులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

"సతారా నుంచి ముంబై వైపు వెళుతున్న ఒక కంటైనర్ ట్రక్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల అదుపు తప్పిందని తెలిసింది. ఆ ట్రక్ ఏడు నుంచి ఎనిమిది వాహనాలను ఢీకొట్టింది. చివరకి మరో పెద్ద కంటైనర్ ట్రక్కును బలంగా ఢీకొంది. ఒక కారు వాటి మధ్యలో చిక్కుకుని నుజ్జునుజ్జు అయింది... మంటల్లో కాలిపోయింది" అని సంఘటనా స్థలానికి చేరుకున్న ఒక పోలీసు అధికారి తెలిపారు. అతివేగం, బ్రేక్ ఫెయిల్ కావడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించామని ఆయన పేర్కొన్నారు.
Pune accident
Pune
Navale Bridge
Container fire
Road accident
India road accident

More Telugu News