Pawan Kalyan: 'ఆపరేషన్ అరణ్య' హ్యాష్ ట్యాగ్ తో పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్

Pawan Kalyan Tweets on Operation Aranya Red Sanders Smuggling
  • 'ది వైల్డ్ ఈస్ట్' పుస్తకం ప్రస్తావన తెచ్చిన పవన్ కల్యాణ్
  • శేషాచలం అడవుల్లో జరిగిన దోపిడీ వివరాలు నన్ను నివ్వెరపరిచాయని వెల్లడి
  • అడవికి, ప్రకృతికి జరిగిన ద్రోహం తన మనసును కలిచివేసిందంటూ ట్వీట్
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. '#OperationAranya' (ఆపరేషన్ అరణ్య) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన పెట్టిన పోస్ట్, ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడానికి సిద్ధమవుతోందనే బలమైన సంకేతాలను ఇస్తోంది. శేషాచలం, తూర్పు కనుమల్లో సహజ వనరుల దోపిడీపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

కొంతకాలం క్రితం తాను 'ది వైల్డ్ ఈస్ట్' అనే పుస్తకాన్ని చదవడం ప్రారంభించానని, అందులోని వివరాలు తనను తీవ్రంగా ఆశ్చర్యపరిచాయని పవన్ కల్యాణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. "వ్యవస్థ కళ్లెదుటే శేషాచలం, తూర్పు కనుమల్లోని ఎర్రచందనం, మన అమూల్యమైన సహజ సంపదను ఎలా దోచుకున్నారో ఈ పుస్తకం కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. రాజకీయం ముసుగులో దాక్కున్న కొందరు నేతలు పూర్తిస్థాయి మాఫియా డాన్లలా ఎలా వ్యవహరించారో ఇది బహిర్గతం చేస్తుంది" అని ఆయన వివరించారు.

పుస్తకంలోని ఒక పాత్ర తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందని పవన్ తెలిపారు. "ఓ చిన్నపాటి కాంట్రాక్టర్, అధికార దాహంతో ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యానికి అధినేతగా ఎలా మారాడో రచయిత అద్భుతంగా చూపించారు. అది చదువుతుంటే కేవలం నేరాన్ని అర్థం చేసుకోవడమే కాదు.. మన నేల, అడవులు, ప్రకృతి, ప్రజలకు జరిగిన ద్రోహాన్ని అనుభూతి చెందవచ్చు" అని ఆయన వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనం స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరిగిందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించడం తెలిసిందే.
Pawan Kalyan
Operation Aranya
Janasena
Andhra Pradesh
Red Sanders Smuggling
Seshachalam
Eastern Ghats
Natural Resources
Illegal Logging
AP Politics

More Telugu News