Ram Gopal Varma: విద్యా వ్యవస్థ చచ్చిపోయింది.. విద్యార్థులారా మేల్కొనండి: ఏఐపై ఆర్జీవీ సంచలన ట్వీట్

RGV Sensational Tweet Education System Dead Wake Up
  • ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయిందన్న రామ్ గోపాల్ వర్మ
  • జ్ఞాపకశక్తి ఆధారిత విద్యా విధానం ఇక పనికిరాదని వ్యాఖ్య
  • ఏఐ టూల్స్ వాడటం నేర్పడమే నిజమైన విద్య అని సూచన
వివాదాలకు, సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవం నేపథ్యంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ పూర్తిగా "చనిపోయింది" అంటూ ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. "విద్యార్థులారా మేల్కొండి.. ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది" అని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.

ప్రస్తుత విద్యా విధానం పూర్తిగా కాలం చెల్లినదని, దానిపై పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైందని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేవలం జ్ఞాపకశక్తిపై ఆధారపడిన చదువులకు ఇక విలువ ఉండదని స్పష్టం చేశారు. "ఒకే ఒక్క క్లిక్‌తో లక్షల కేసులను విశ్లేషించి ఏఐ చికిత్స సూచించగలిగినప్పుడు, విద్యార్థులు పదేళ్ల పాటు విషయాలను గుర్తుపెట్టుకోవడానికి ఎందుకు సమయం వృధా చేయాలి?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

భవిష్యత్ తరాల విద్య పుస్తకాల్లోని సమాచారాన్ని బట్టీ పట్టడం కాదని, ఏఐ పరికరాలను సృజనాత్మకంగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడంలోనే ఉందని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలు, విద్యా బోర్డులు మారే వరకు ఏఐ వేచి చూడదని, మార్పును అందిపుచ్చుకోలేని వ్యవస్థలను అది చెరిపేస్తుందని ఆయన హెచ్చరించారు. పాఠశాలలు సైతం తమ బోధన పద్ధతులను మార్చుకుని, పరీక్షల్లో ఏఐని ఒక సహాయక సాధనంగా అనుమతించాలని సూచించడం గమనార్హం.

"ఏఐ మిమ్మల్ని చంపదు, కేవలం పట్టించుకోదు" అని వ్యాఖ్యానించిన వర్మ, "ఏఐని వాడలేని వారు భవిష్యత్తులో ఏఐ చేతనే వాడబడతారు" అంటూ తీవ్రమైన హెచ్చరిక చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య విస్తృత చర్చకు దారి తీశాయి. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలనే దానిపై కొత్త ఆలోచనలకు ఈ ట్వీట్ తెరలేపింది.
Ram Gopal Varma
RGV
AI Revolution
Artificial Intelligence
Education System
AI in Education
Future of Education
Online Learning
Technology in Education
AI Tools

More Telugu News