Jagan: మీ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అద్భుతం: చంద్రబాబుపై జగన్ సెటైర్లు

Jagan Slams Chandrababu Over Housing Scheme Credit
  • ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
  • 'క్రెడిట్ చోరీ స్కీం' అద్భుతంగా నడుస్తోందంటూ ఎద్దేవా
  • వైసీపీ హయాంలో కట్టిన ఇళ్ల క్రెడిట్ కొట్టేస్తున్నారని విమర్శ
  • ఇతరుల కష్టాన్ని చెప్పుకునేవాడు నాటకాల రాయుడు అని వ్యాఖ్య
  • పచ్చి అబద్ధాలతో ప్రచారం చేసుకోవడం హేయమన్న జగన్
ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య 'క్రెడిట్' వార్ తీవ్రస్థాయికి చేరింది. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విజయవంతంగా "క్రెడిట్ చోరీ స్కీం" నడుపుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పేదల ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం వాస్తవాలను పక్కనపెట్టి, తమ ఘనతగా ప్రచారం చేసుకుంటోందని జగన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. "చంద్రబాబు గారూ.. మీ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న 'క్రెడిట్ చోరీ స్కీం' చాలా బాగుంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు. నాటకాల రాయుడు అంటారు" అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి, నిర్మాణం ప్రారంభించిన ఇళ్లనే ఇప్పుడు తామే కట్టేశామంటూ కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని జగన్ విమర్శించారు. "గత 18 నెలల్లో పేదలకు ఒక్క గజం స్థలం సేకరించలేదు, ఒక్క సెంటు స్థలం ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాల్లో, మేం శాంక్షన్ చేయించిన ఇళ్లనే పట్టుకుని 'అన్నీ మేమే కట్టేశాం' అని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఈ క్రెడిట్ చోరీ హేయంగా ఉంది" అని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రారంభించామని చెబుతున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వలేదని జగన్ స్పష్టం చేశారు. "ఆ ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నాయి. మరో 87,380 ఇళ్లు స్లాబ్ లెవల్ వరకు, 66,845 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నవి కూడా మా హయాంలో మొదలైనవే. ఇవి కాకుండా అక్టోబర్ 12, 2023న ఒకేరోజు 7,43,396 ఇళ్ల గృహప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది" అని జగన్ గుర్తుచేశారు.

తమ హయాంలో 31.19 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి, 21.75 లక్షల ఇళ్లు శాంక్షన్ చేశామని జగన్ తెలిపారు. మిగిలిన 10 లక్షల ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాల్సింది పోయి, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. "ఒకరి కష్టాన్ని, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, చివరికి పేదల ఇళ్ల స్థలాలను లాక్కోవడంలో మీకు మీరే సాటి" అంటూ విమర్శించారు. తన పోస్టుకు #CreditChorBabu అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి చంద్రబాబుపై తన పోరాటాన్ని సోషల్ మీడియాలో ఉద్ధృతం చేశారు.
Jagan
YS Jagan
Chandrababu
Andhra Pradesh politics
housing scheme
credit war
YSRCP
TDP
house construction
government schemes

More Telugu News