Jaish-e-Mohammed: డిసెంబర్ 6న ఢిల్లీలో 6 చోట్ల పేలుళ్లకు జైషే కుట్ర.. పట్టుబడ్డ ఉగ్రవాదుల వెల్లడి

Jaish planned Delhi blasts to avenge Babri Masjid demolition
  • బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకార దాడులకు ప్లాన్
  • సహచరులు పట్టుబడడంతోనే డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడి
  • 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసిన కరసేవకులు
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై వెనక ఉగ్రవాదుల భారీ కుట్ర తాజాగా వెలుగులోకి వచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా వచ్చే నెల 6న ఢిల్లీ– ఎన్సీఆర్ పరిధిలో ఆరేడు చోట్ల పేలుళ్లు జరపాలని ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు తేలింది. ఈ కుట్రను అమలు పరిచే క్రమంలో కారులో అసాల్ట్ రైఫిల్ తో ఓ డాక్టర్ పట్టుబడడం, మిగతా ఉగ్రవాదులనూ పోలీసులు అరెస్టు చేయడంతో పేలుళ్ల ప్లాన్ బెడిసికొట్టింది. సహచరులంతా పట్టుబడడంతో డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఎర్రకోట వద్ద కారులో ఆత్మాహుతి దాడి చేశాడని అధికారులు తెలిపారు.
 
1992 డిసెంబర్ 6న ఢిల్లీలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేసిన విషయం తెలిసిందే. రామజన్మభూమిలో మసీదు నిర్మించారనే ఆరోపణలతో కరసేవకులు ఈ కూల్చివేతకు పాల్పడ్డారు. దీనిపై పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న జైషే మహ్మద్ సంస్థ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. బాబ్రీ కూల్చివేతకు ప్రతీకారంగా భారత్ లో పేలుళ్లకు పాల్పడతామని తెలిపింది. తాజాగా వచ్చే నెల 6వ తేదీన ఢిల్లీ–ఎన్సీఆర్ పరిధిలో పేలుళ్లకు ప్లాన్ చేసింది.
 
పోలీసులకు పట్టుబడక ముందు ఉగ్రవాదులు ఢిల్లీలోని పలు ప్రాంతాలలో రెక్కీ నిర్వహించినట్లు తేలింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ మహ్మద్ ఎరుపు రంగు కారులో ఎర్రకోటతో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాడని పట్టుబడిన ఉగ్రవాదులు వెల్లడించినట్లు సమాచారం. డాక్టర్లు కావడంతో వారిని ఎవరూ అనుమానించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పేలుళ్లకు అవసరమైన ఐఈడీ సహా ఇతరత్రా ఏర్పాట్లను ఉగ్రవాదులు పకడ్బందీగా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కారులో అసాల్ట్ రైఫిల్ తో డాక్టర్ పట్టుబడడంతో ఈ ఉగ్రవాద డొంక కదిలిందని, మిగతా ఉగ్రవాదులు పట్టుబడడంతో పేలుళ్ల కుట్ర భగ్నమైందని అధికారులు వెల్లడించారు.
Jaish-e-Mohammed
Delhi blasts
terrorist plot
Babri Masjid demolition
Red Fort
Dr Umar Mohammad
Delhi NCR
IED
assault rifle
terror attack

More Telugu News