Chandrababu Naidu: విశాఖలో పెట్టుబడుల జోష్.. సీఐఐ సదస్సుకు ముందే సీఎం చంద్రబాబు కీలక భేటీలు

Chandrababu Meetings Before CII Summit Focus on Visakhapatnam Investments
  • విశాఖలో రేపటి నుంచి సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సు
  • సదస్సుకు ముందే పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశాలు
  • ఈ సాయంత్రం పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం
  • యూరప్ దేశాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం
  • తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతోనూ భేటీలు
ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. విశాఖపట్నం వేదికగా రేపు, ఎల్లుండి (శుక్ర, శనివారాలు) జరగనున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం సర్వం సిద్ధమైంది. ఈ సదస్సు ప్రారంభానికి ఒక రోజు ముందే సీఎం చంద్రబాబు గురువారం పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులతో వరుస సమావేశాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సాయంత్రం ఆయన సమక్షంలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకోనుంది.

ఇవాళ‌ ఉదయం 10 గంటలకు నగరంలోని నోవోటెల్ హోటల్‌లో జరిగిన "పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్: ఇండియా - యూరోప్ కోపరేషన్ ఫర్ సస్టెయినబుల్ గ్రోత్" అనే అంశంపై సీఎం చంద్రబాబు ఇండియా-యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రీన్ షిఫ్ట్, సుస్థిర ఆవిష్కరణలు, ఏపీలో యూరోపియన్ పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై పారిశ్రామిక ప్రతినిధులతో ఆయన విస్తృతంగా చర్చించారు.

మధ్యాహ్నం నుంచి సీఎం చంద్రబాబు పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. అనంతరం ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్ ఎండీ అలోక్ కిర్లోస్కర్, రెన్యూ పవర్ చైర్మన్ సుమిత్ సిన్హా, యాక్షన్ టెసా గ్రూప్ ఛైర్మన్ ఎన్.కె. అగర్వాల్‌తో సమావేశమవుతారు. వీటితో పాటు మురుగప్ప గ్రూప్ ఛైర్మన్ అరుణ్ అలగప్పన్, కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎండీ శంకర్ సుబ్రహ్మణియన్, జూల్ గ్రూప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఛైర్మన్ రాహుల్ ముంజాల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలతోనూ చంద్రబాబు చర్చలు జరపనున్నారు.

ఈ సమావేశాల అనంతరం సాయంత్రం జరగనున్న ‘వైజాగ్ ఎకనమిక్ రీజియన్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత సీఐఐ నేషనల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి కూడా హాజరుకానున్నారు. ఈ వరుస భేటీలు, ఒప్పందాలు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో దోహదపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Visakhapatnam
CII Partnership Summit
Investments AP
AP Industrial Development
European Investments India
Vizag Economic Region
MoUs Andhra Pradesh
Industrial Growth

More Telugu News