Google Doodle: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ప్రత్యేకత ఇదే!

Google Doodle In India Highlights DNA And Its Role In Foundation Of Biology
  • భారత్‌లో డీఎన్ఏపై ప్రత్యేక యానిమేటెడ్ డూడుల్‌ను ప్రదర్శించిన గూగుల్
  • డబుల్ హెలిక్స్ నిర్మాణంతో ఆకట్టుకుంటున్న డూడుల్
  • దీనిపై క్లిక్ చేస్తే గూగుల్ జెమినీ ఏఐ పేజీ ఓపెన్ అవుతున్న వైనం
  • డీఎన్ఏ బేస్ పెయిరింగ్ గురించి వివరిస్తున్న జెమినీ
  • గతంలో అమెరికా, యూరప్‌లలోనూ ఈ డూడుల్‌ ప్రదర్శన‌
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ గురువారం భారత్‌లో తన హోమ్‌పేజీపై ఒక ప్రత్యేక డూడుల్‌ను ప్రదర్శించింది. జీవశాస్త్రంలో అత్యంత కీలకమైన, ఎక్కువగా శోధించే అంశాల్లో ఒకటైన డీఎన్ఏ (డీఆక్సీరైబోన్యూక్లియిక్ యాసిడ్)కు నివాళిగా ఈ యానిమేటెడ్ డూడుల్‌ను రూపొందించింది. డీఎన్ఏ డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని చూపుతూ, జీవుల మనుగడకు ఆధారం ఇదేనని ఈ డూడుల్ ద్వారా గూగుల్ వివరిస్తోంది.

"డీఆక్సీరైబోన్యూక్లియిక్ యాసిడ్ గురించి ఈ డూడుల్ వివరిస్తుంది. ఇది అన్ని జీవుల పెరుగుదల, పునరుత్పత్తి, ఇతర విధులకు అవసరమైన జన్యుపరమైన సూచనలను మోసే ఒక మాలిక్యులర్ పాలిమర్. రెండు గొలుసులు కలిసి డబుల్ హెలిక్స్‌గా ఏర్పడతాయి" అని ఈ డూడుల్ గురించి గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది. సాధారణంగా స్కూల్స్ నడిచే సమయంలో డీఎన్ఏకు సంబంధించిన సెర్చ్‌లు ఎక్కువగా ఉంటాయని గూగుల్ తెలిపింది.

ఈ డూడుల్ కేవలం యానిమేషన్‌కే పరిమితం కాలేదు. దానిపై క్లిక్ చేయగానే యూజర్లను గూగుల్ జెమినీ ఏఐ (AI) మోడ్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ డీఎన్ఏలోని రసాయన బేస్‌లైన అడెనిన్ (A), థైమిన్ (T), సైటోసిన్ (C), గ్వానిన్ (G) వాటి క్రమం గురించి ఒక ప్రశ్న అడుగుతుంది. దీనికి సమాధానంగా జెమినీ ఏఐ "డీఎన్ఏలోని బేస్‌ల క్రమం కచ్చితమైన నియమాలను పాటిస్తుంది. A ఎల్లప్పుడూ Tతో, C ఎల్లప్పుడూ Gతో జతకడుతుంది. ఈ క్రమంలో ఏవైనా పొరపాట్లు జరిగితే ఉత్పరివర్తనాలకు దారితీయవచ్చు" అని వివరిస్తుంది.

ఈ డీఎన్ఏ డూడుల్‌ను గూగుల్ తొలిసారిగా ఈ ఏడాది సెప్టెంబర్ 10న అమెరికాలో ప్రదర్శించింది. ఆ తర్వాత యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని పలు దేశాల్లో కూడా అందుబాటులోకి తెచ్చింది.

గూగుల్ డూడుల్స్ చరిత్ర
గూగుల్ డూడుల్ అనేది పండుగలు, చారిత్రక సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జయంతులు, వార్షికోత్సవాలు, శాస్త్రీయ ఆవిష్కరణలను పురస్కరించుకుని గూగుల్ తన హోమ్‌పేజీ లోగోను తాత్కాలికంగా మార్చడం. తొలి గూగుల్ డూడుల్‌ను 1998లో ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ రూపొందించారు. తాము 'బర్నింగ్ మ్యాన్' ఫెస్టివల్‌కు వెళ్తున్నామని యూజర్లకు తెలియజేయడమే దాని ఉద్దేశం. ఇక 2000వ సంవత్సరంలో ఫ్రాన్స్‌లో బాస్టిల్ డే సందర్భంగా తొలి అంతర్జాతీయ డూడుల్‌ను ప్రారంభించారు. 2010లో ప్రముఖ గేమ్ 'ప్యాక్-మ్యాన్' 30వ వార్షికోత్సవం సందర్భంగా తొలి ఇంటరాక్టివ్ గేమ్ డూడుల్‌ను ప్రవేశపెట్టారు.
Google Doodle
DNA
Deoxyribonucleic Acid
Google Gemini AI
Larry Page
Sergey Brin
Google Search
Animated Doodle
Science
Genetics

More Telugu News