Ambati Rambabu: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

Case Filed Against Ambati Rambabu in Guntur
  • ఆయనతో పాటు ఇతర వైసీపీ నేతలపైనా కేసు
  • పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్
  • పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ
  • అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించారని అభియోగం
  • బీఎన్‌ఎస్‌ కింద పలు సెక్షన్లతో కేసు నమోదు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై కూడా గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిని బెదిరించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబటి రాంబాబు, ఇతర నేతలు ముందస్తు అనుమతులు లేకుండా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు, ప్రజలకు అసౌకర్యం కలిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న పోలీసులు, విధుల్లో ఉన్న తమను బెదిరించారని పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
 
అంబటి రాంబాబుతో పాటు ఇతర నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని 132, 126(2), 351(3), 189(2), రెడ్‌ విత్‌ 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు పట్టణంలో నిన్న వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంలో పోలీసులు అనుమతి లేదని అడ్డుకోవడంతో పోలీసులతో అంబటి వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు.  
Ambati Rambabu
YSRCP
Guntur
Pattabhipuram Police
Case Filed
Police Obstruction
Traffic Disruption
PPP Scheme Protest

More Telugu News