H-1B Visa: హెచ్-1బీ వీసాలు అమెరికన్ల కోసమే... ట్రంప్ సర్కార్ సరికొత్త ఆలోచన

Donald Trump H1B Visa Policy Focus on Training Americans
  • హెచ్-1బీ వీసాలపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కొత్త విధానం
  • అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకే విదేశీ నిపుణుల రాక
  • కొన్నేళ్లు పనిచేసి, నాలెడ్జ్ బదిలీ చేసి వెనక్కి వెళ్లాలన్నది ప్రణాళిక
  • అమెరికా తయారీ రంగాన్ని తిరిగి బలోపేతం చేయడమే లక్ష్యం
  • ప్రస్తుతం ఆ ఉద్యోగాలు చేసే నైపుణ్యం అమెరికన్లలో లేదన్న ట్రెజరీ సెక్రటరీ
అమెరికాలో అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా విధానంపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇకపై విదేశీ నిపుణులను దీర్ఘకాలిక ఉద్యోగాల కోసం కాకుండా అమెరికన్లకు అత్యున్నత నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చేందుకు తాత్కాలికంగా దేశంలోకి అనుమతించనున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. వలస విధానాలపై కఠినంగా వ్యవహరించే ట్రంప్, కొన్ని రంగాల్లో విదేశీ ప్రతిభ అవసరమని చెప్పిన నేపథ్యంలో బెస్సెంట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, స్కాట్ బెస్సెంట్ ఈ కొత్త విధానాన్ని నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియగా అభివర్ణించారు. దశాబ్దాలుగా ఇతర దేశాలకు తరలిపోయిన అమెరికా తయారీ రంగాన్ని తిరిగి దేశంలోనే పునరుద్ధరించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. "గత 20-30 ఏళ్లుగా మనం అత్యంత కచ్చితత్వంతో కూడిన తయారీ రంగ ఉద్యోగాలను విదేశాలకు పంపించేశాం. ఇప్పుడు వేలికి చిటికేస్తే రాత్రికి రాత్రే నౌకలు తయారు కావు. సెమీకండక్టర్ పరిశ్రమను తిరిగి అమెరికాకు తీసుకురావాలనుకుంటున్నాం. దీనికోసం అరిజోనాలో భారీ పరిశ్రమలు రానున్నాయి" అని ఆయన వివరించారు.

ట్రంప్ ఆలోచనా విధానాన్ని ఆయన వివరిస్తూ, "అధ్యక్షుడి దృష్టి చాలా స్పష్టంగా ఉంది. అవసరమైన నైపుణ్యాలు కలిగిన విదేశీ నిపుణులను మూడు, ఐదు లేదా ఏడేళ్ల కాలానికి ఇక్కడికి తీసుకురావాలి. వారు అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవచ్చు. శిక్షణ పొందిన అమెరికన్ కార్మికులు ఆ ఉద్యోగాలను చేపడతారు" అని బెస్సెంట్ అన్నారు.

విదేశీయుల వల్ల అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయనే ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. "ఆ ఉద్యోగాలు ప్రస్తుతం ఒక అమెరికన్ చేయలేరు. ఎందుకంటే ఆ నైపుణ్యం ప్రస్తుతానికి మన దగ్గర లేదు. చాలా ఏళ్లుగా మనం ఇక్కడ నౌకలు గానీ, సెమీకండక్టర్లు గానీ తయారుచేయడం లేదు. కాబట్టి విదేశీ భాగస్వాములు వచ్చి అమెరికన్ కార్మికులకు నైపుణ్యాలు నేర్పించడం దేశానికి ఒక 'హోమ్ రన్' లాంటిది" అని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త హెచ్‌-1బీ విధానం, కీలక పరిశ్రమలను తిరిగి స్వదేశానికి రప్పించి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలన్న ట్రంప్ విస్తృత లక్ష్యంలో భాగమని ఆయన స్పష్టం చేశారు.

కుటుంబాలకు టారిఫ్ రిబేట్
ఇదే సమయంలో ట్రంప్ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికల గురించి కూడా బెస్సెంట్ ప్రస్తావించారు. లక్ష డాలర్ల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలకు 2వేల డాల‌ర్ల‌ టారిఫ్ రిబేట్ (సుంకాల రాయితీ) ఇచ్చే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని ధ్రువీకరించారు. "బలమైన వాణిజ్య విధానం వల్ల కలిగే ప్రయోజనాలు కుటుంబాలకు అందాలన్నది అధ్యక్షుడి ఆలోచన" అని ఆయన తెలిపారు. వాల్ స్ట్రీట్, మెయిన్ స్ట్రీట్ (పెట్టుబడిదారులు, సామాన్యులు) రెండూ సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నదే ట్రంప్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
H-1B Visa
Donald Trump
US Economy
American Workers
Skott Besant
Foreign workers
Job Market
Tariff Rebate
US Manufacturing
Immigration Policy

More Telugu News