Kavitha: ఇదేనా బంగారు తెలంగాణ?.. రెండు ప్రభుత్వాల పాలనలో మార్పు లేదు: కవిత

Kavitha Criticizes Telangana Governance Under BRS and Congress
  • గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తేడా లేదన్న క‌విత‌
  • నల్గొండ ప్రభుత్వ ఆసుప‌త్రిలో కనీస వసతులు లేవ‌ని విమ‌ర్శ‌
  • 20 శాతం తేమ ఉన్న పత్తిని కొనాలని డిమాండ్
  • నల్గొండలో తన ఫ్లెక్సీల తొలగింపుపై తీవ్ర ఆగ్రహం
  • జాగృతి నేతలతో పెట్టుకోవద్దని ప్రత్యర్థులకు హెచ్చరిక
గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో రాష్ట్రంలోని సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. రెండు ప్రభుత్వాల హయాంలోనూ ప్రజల కష్టాలు తీరలేదని, ఇదేనా బంగారు తెలంగాణ అని ఆమె ప్రశ్నించారు. బుధవారం నల్గొండలో పర్యటించిన ఆమె, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.

నల్గొండ జిల్లాకు గత 12 ఏళ్లుగా కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో అందాయో లేదో ఆలోచించుకోవాలని కవిత అన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే కాంట్రాక్టర్‌ను ఒక్క మాట కూడా అనలేని దుస్థితి నెలకొందని విమర్శించారు. ప్రాజెక్టుల వద్దకు తాము వెళ్తే నిర్వాసితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలోని మెటర్నిటీ వార్డులో కనీస వసతులు లేవని, ఐసీయూలో ఒకే బెడ్‌పై ఇద్దరు రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. గర్భిణులకు ప్రసవ సమయంలో ఇచ్చే ఎపిడ్యూరల్ మందు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరమని అన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. భూదాన్ భూములను ఎందుకు వెనక్కి తీసుకోలేదని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ఏపీ చేతుల్లో ఉంటే, ఎడమ కాలువను కేంద్రం చేతుల్లో పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో సామాజిక తెలంగాణ రావాల్సి ఉందని, దానికోసం జాగృతి నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతులు పండించిన పత్తిలో 20 శాతం తేమ ఉన్నప్పటికీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, నిబంధనలు సడలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు, కవిత పర్యటనను పురస్కరించుకుని జాగృతి నాయకులు నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అయితే, మున్సిపల్ అధికారులు వాటిని రాత్రికి రాత్రే తొలగించడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"నాకు, మంత్రి కోమటిరెడ్డికి ఎలాంటి పంచాయతీ లేదు. అయినా నా ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారు?" అని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అరెస్ట్ చేసిన జాగృతి నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాను ప్రజా సమస్యలపై పోరాడేందుకే నల్గొండ వచ్చానని, రాజకీయాలు చేసేటప్పుడు బలమైన అభ్యర్థులనే బరిలో దింపుతామని అన్నారు. "జాగృతి నాయకులతో పెట్టుకున్న వాళ్లు ఎవరూ బాగుపడలేదు" అని కవిత వ్యాఖ్యానించారు.
Kavitha
Kalvakuntla Kavitha
BRS
Congress Government
Nalgonda
Telangana Jagruthi
Krishna River
SLBC Tunnel
Farmers issues
Telangana Politics

More Telugu News