Delhi AQI: మూడో రోజూ 400 దాటిన AQI... కాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ

Air in Delhi turns suffocating as AQI remains above 400
  • ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్ర వాయు కాలుష్యం
  • వరుసగా మూడో రోజు 400 దాటిన గాలి నాణ్యత సూచీ
  • నగరాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు
  • 5వ తరగతి వరకు విద్యార్థులకు హైబ్రిడ్ విధానంలో బోధన
  • గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-3 అమలులో భాగంగా నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలోనే కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు బుధవారం కూడా గాలి నాణ్యత సూచీ (AQI) 400 పైన 'తీవ్ర' కేటగిరీలోనే నమోదైంది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో చాలా ప్రాంతాల్లో దృశ్యమానత (visibility) గణనీయంగా పడిపోయింది. దీంతో ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం అల్లాడిపోతున్నారు.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విడుదల చేసిన డేటా ప్రకారం బుధవారం ఉదయం గీతా కాలనీ-లక్ష్మీ నగర్ రోడ్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 413గా నమోదైంది. ఇండియా గేట్, కర్తవ్య పథ్ పరిసరాలను సైతం విషపూరిత పొగమంచు కప్పేయగా, అక్కడ AQI 408గా ఉంది. నగరంలోని ఇతర ప్రాంతాలైన ఆనంద్ విహార్‌లో 438, అశోక్ విహార్‌లో 439, చాందినీ చౌక్‌లో 449, ద్వారకా సెక్టార్-8లో 422, ఐటీఓలో 433, జహంగీర్‌పురిలో 446, ఆర్‌కే పురంలో 432, రోహిణిలో 442గా గాలి నాణ్యత న‌మోదైంది. ఇంతటి కాలుష్యానికి ఎక్కువసేపు గురైతే తీవ్రమైన శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-స్టేజ్ 3 చర్యలను అమలు చేయడంలో భాగంగా 5వ తరగతి వరకు విద్యార్థులకు బుధవారం నుంచి హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది.

"జీఆర్ఏపీ ఫేజ్-3 కింద భద్రతా చర్యలు వేగంగా అమలు చేస్తున్నాం. బుధవారం నుంచి 5వ తరగతి వరకు క్లాసులు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. పాఠశాలల్లో హైబ్రిడ్ విధానం అమల్లో ఉంటుంది" అని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తెలిపారు.

ఈ మేరకు ఢిల్లీ విద్యాశాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. "విద్యాశాఖ, ఎన్‌డీఎంసీ, ఎంసీడీ, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు తక్షణమే 5వ తరగతి వరకు విద్యార్థులకు హైబ్రిడ్ (ఫిజికల్, ఆన్‌లైన్) విధానంలో తరగతులు నిర్వహించాలి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ విధానం కొనసాగుతుంది" అని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ కొత్త ఏర్పాట్ల గురించి తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలని పాఠశాలల యాజమాన్యాలను విద్యాశాఖ డైరెక్టర్ వేదితా రెడ్డి ఆదేశించారు.

ఇదిలా ఉండగా.. కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలపై వివరణాత్మక నివేదికలు సమర్పించాలని ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులను ఆయన ఆదేశించారు.
Delhi AQI
Delhi Pollution
Air Quality Index
AQI
Delhi AQI
Pollution in Delhi
Bhupender Yadav
GRAP
Delhi Schools
Hybrid Classes
Air Pollution

More Telugu News